ఆంధ్రాలో ఇప్పుడు ఆ పట్టణం కరోనాకు కేరాఫ్ అయ్యింది. అందరినీ హడలెత్తిస్తోంది. అదే నరసరావుపేట. గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే వంద కేసు దాటిపోయాయి. కరోనా కేసుల పరంగా రాష్ట్రంలోనే రెండో అత్యధిక కేసులున్న గుంటూరు జిల్లాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 287కు చేరింది. జిల్లాలో ఇప్పటిదాకా 8 మంది మృతి చెందగా... 87 మందికి వ్యాధి నయమైంది.

 

అయితే ఈ మొత్తం 287 కేసుల్లో వందకు పైగా కేసులు ఒక్క నరసరావుపేట పట్టణంలోనే ఉన్నాయి. అందుకే ఇక్కడ కరోనా కట్టడి కోసం అధికారులు ఫోకస్ చేశారు. ఇప్పటికే రెండు రోజుల నుంచి ఫుల్ లాక్ డౌన్ చేశారు. ఇప్పుడు మరో మూడు రోజుల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. పట్టణంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో అధికారులతో కలిసి కవాతు నిర్వహించిన కలెక్టర్ కరోనా కేసులు తగ్గకపోతే లాక్ డౌన్ పొడిగిస్తామని మరోసారి చెప్పారు.

 

 

ప్రధానంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న వరవకట్టలో కరోనా తగ్గుదలకు పాటించాల్సిన నియమాలను వివరించారు. ప్రజలందరూ లాక్ డౌన్ కు సహకరించాలని కలెక్టర్ శామ్యూల్ విజ్ఞప్తి చేశారు. నిత్యావసరాలను ఇళ్లవద్దకే సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఎక్కువగా ఉన్న జిల్లాలు కర్నూలు, కృష్ణా, గుంటూరు. గుంటూరు జిల్లాలో ప్రత్యేకంగా నరసరావుపేట హడలెత్తిస్తోంది. చిన్న పట్టణమే అయినా కరోనా కేసుల్లో దూసుకుపోతోంది.

 

 

కేవలం రెండులక్షల జనాభా ఉండే నరసరావుపేటలో కరోనా రోగుల సంఖ్య వంద దాటింది. నరసరావుపేటలో ఏప్రిల్ 12న ఓ కేబుల్ ఆపరేటర్ కు కరోనా వచ్చింది. ఆ తర్వాత అడపాదడపా ఒకటి, రెండు కేసులు నమోదయ్యాయి. ఓ వారం నుంచి తీవ్రత బాగా పెరిగింది. నరసరావుపేటలోని వరవకట్ట ప్రాంతంలో అత్యధికంగా 80కిపైగా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. వైరస్‌ మరింత విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: