తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా నియంత్రణ లో భాగంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్  సమయంలో ప్రజలందరూ ఇంటికే పరిమితం కావాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఇక అన్ని రవాణా వ్యవస్థలు మూసి వేయడంతో పాటు నిత్యావసర సరుకులు మినహా మిగతా అన్ని దుకాణాలు కూడా మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇలాంటి సమయంలో ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో లేవో అనే విషయం పక్కనపెడితే... మందుబాబులకు మాత్రం లాక్ డౌన్  మొదలైనప్పటి నుంచి గోసలు  మొదలైన విషయం తెలిసిందే. రోజు హాయిగా ఒక పెగ్గు వేసి నిద్రపోయే  మందుబాబులు లాక్ డౌన్  నేపథ్యంలో వైన్ షాపులు తెరవక పోవడంతో తీవ్ర నానా తంటాలు పడుతున్నారు. 

 

 

 పొద్దున లేవగానే చుక్కా మందు  గొంతు లోకి వెళితే గానీ రోజు గడవని మందుబాబులు వైన్ షాపులు మూసేయడంతో ఏం చేయాలో పాలుపోక అయోమయంలో పడిపోయారు. ఇక ఎక్కడ మద్యం దొరకకపోవడంతో.. మద్యం  దొరికితే చాలు ఎంత రేటు కైనా కొనడానికి సిద్ధంగా ఉన్నట్లు గా మారిపోయారు మందుబాబులు. ఇంకేముంది మందుబాబుల అవసరాన్ని అవకాశంగా మార్చుకుంటున్నారు కొంతమంది. గుట్టుచప్పుడు కాకుండా మద్యం  తీసుకొచ్చి బ్లాక్ లో అమ్మకాలు జరుపుతున్నారు. 

 

 

 భారీ ధరలకు  అమ్ముతూ మందుబాబుల జేబులు  గుళ్ల చేస్తున్నారు అక్రమ మద్యం వ్యాపారులు. ఇక తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లా తూప్రాన్ కు చెందిన రవి అనే యువకుడు అక్రమంగా మద్యం అమ్మకాలను ప్రారంభించాడు. అది కూడా ఎక్కడ అనుకుంటున్నారా... ఎవరికీ అనుమానం రాకుండా స్మశానంలో సరుకు ఉంచి  అక్కడే అమ్మకాలు ప్రారంభించాడు సదరు యువకుడు. ఇక ఈ వ్యవహారం చాలా రోజుల నుండి కొనసాగుతూనే వస్తోంది. కీలక సమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకోవడంతో అసలు విషయం బయటపడింది. యువకుడి దగ్గర నుంచి లక్ష రూపాయల విలువైన మద్యం సరుకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: