ఎప్పుడూ ఎంతో నెమ్మ‌దిగా.. నిమ్మ‌లంగా క‌నిపించే తెలంగాణ ఆర్థిక‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావుకు కోపం వ‌చ్చింది. ఎందుక‌ని అనుకుంటున్నారా..? ఇందుకు బ‌ల‌మైన కార‌ణ‌మే ఉందండి.. ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం విశాఖలో ఎల్జీపాలిమ‌ర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘ‌ట‌న నేప‌థ్యంలో ఇక్క‌డ అప్ర‌మ‌త్తం అయ్యారు. అంతేగాకుండా త‌మిళ‌నాడు, చెన్నై త‌దిత‌ర రాష్ట్రాల్లోని కంపెనీల్లో కూడా వ‌రుస ప్ర‌మాదాలు చోటుచేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో సంగారెడ్డిలో పరిశ్రమల కాలుష్యం​, కరోనా నివారణకి తీసుకుంటున్న చర్యలపై ఇండస్ట్రీ యాజమాన్యాలతో, అధికారులతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలలో కచ్చితంగా గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు ఇండస్ట్రీ యాజమాన్యాలను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. యాజమాన్యాలు బస్సులలో కనీస దూరం పాటించకుండా కార్మికులను తరలిస్తున్నారని మండిపడ్డారు. దీనిని అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్నారు. కరోనాకి జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విశాఖ గ్యాస్‌ లికేజీ ఘటనతో జిల్లాలో అప్రమత్తం అయ్యామని ఆయ‌న చెప్పారు. బాయిలర్‌, ఫైర్‌, సెఫ్టీ వాళ్‌లు సరిగా ఇండస్ట్రీలను తనిఖీ చేయడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

జిల్లాలో గత ఏడాది ఇండస్ట్రీ ప్రమాదాలతో 20 మంది చినిపోయారని, గ్యాస్‌, బాయిలర్‌ వదిలేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కంపెనీ యాజమాన్యాలకు సూచించారు. పరిశ్రమల నుంచి రాత్రి సమయంలో విషవాయువు వదులుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. సెఫ్టీ అధికారులు వాళ్ల పని చేయడం లేదని యాజమాన్యాలపై ఆయన విరుచుకుపడ్డారు. కాగా, విశాఖ‌లోని ఆర్ ఆర్ వెంక‌టాపురం గ్రామ స‌మీపంలో ఉన్న ఎల్జీపాలిమ‌ర్స్ కంపెనీలో స్టెరిన్ అనే విష‌వాయువు లీకేజీ ఘ‌ట‌న‌లో సుమారు 12మంది మృతి చెందారు. వంద‌ల మంది అస్వ‌స్థ‌త‌కు గురై ఆస్ప‌త్రుల‌లో చికిత్స పొందుతున్నారు. ఇక ఏపీ ప్ర‌భుత్వం కూడా బాధితుల‌కు భారీగా ప‌రిహారం ప్ర‌క‌టించింది. మృతుల కుటుంబాల‌కు ఏకంగా కోటి రూపాయ‌ల ప‌రిహారం ప్ర‌క‌టించి, ఈ రోజు ఖాతాల్లో జ‌మ చేసింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: