భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మొన్నటివరకు ప్రతిరోజూ 15వేలలోపు కేసులు ఉండగా.. ఈ రోజు  17వేలకుపైగా కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య ఐదు లక్షలకు సమీపిస్తోంది. భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఎన్నడూ లేనంతగా 17,296 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. 407 మంది కరోనాతో  మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,90,401కి చేరింది. మృతులు 15,301కి పెరిగారు.

 

ప్రస్తుతం 1,89,463 యాక్టివ్‌ కేసులుగా ఉండగా.. కోలుకున్న వారి సంఖ్య 2,85,637గా నమోదైంది. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 77,76,228 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 2,15,446 మందికి పరీక్షలు జరిపినట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. 

 

టెస్టులు చేసే కొద్ది పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి. గత వారం రోజుల నుంచి వరసగా 14 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.  కేవలం ఈ నెల 1 నుంచి 26 వరకు దాదాపు 3 లక్షల కేసులు నమోదయ్యాయంటే వైరస్ తీవ్రత అర్థంచేసుకోవచ్చు. ఇప్పటి వరకు కోలుకున్నవారి శాతం 58.24గా ఉంది. 

 

దేశవ్యాప్తంగా ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడులో వైరస్‌ విజృంభణ తీవ్రంగా ఉంది. ఇక.. ఐసీఎంఆర్‌ ఆదేశాల మేరకు మహారాష్ట్రలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలూ తమ ఉద్యోగులకు యాంటీబాడీ టెస్టులు చేయించాలని ఆ రాష్ట్ర సర్కారు ఆదేశించింది. ఢిల్లీ సర్కారు కూడా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలను విస్తృతంగా నిర్వహిస్తోంది.

 

ఢిల్లీలో 193 ల్యాబుల్లో ఈ పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు కొవిడ్‌-19 పరీక్షల నిమిత్తం సేకరించిన నమూనాలను.. టెస్టు పూర్తయ్యాక వెంటనే ధ్వంసం చేయొద్దని, కనీసం 30 రోజులపాటు నిల్వ ఉంచాలని దేశంలోని అన్ని ప్రభుత్వ ల్యాబ్‌లకు ఐసీఎంఆర్‌ సూచించింది. మొత్తానికి మనదేశంలో కరోనా కన్నెర్ర జేస్తోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: