ఏపీలో పరిపాలన వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని సీఎం జగన్‌ నిర్ణయించుకున్నారా..? ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని తన కార్యాలయం నుంచే ప్రారంభించారా..? తాజాగా సీఎంఓలో జరిగిన మార్పులు చేర్పులు దేనికి సంకేతం..? ఏపీ పరిపాలనా వర్గాల్లో ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

 

ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అటు సంక్షేమ రంగంలోనూ.. ఇటు పరిపాలనలోనూ దూకుడు కొనసాగిస్తున్నారు జగన్‌.  పాత వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ కొత్తవి ఏర్పాటు చేశారు. పారదర్శకంగా పరిపాలన అందించే విషయంలో రివర్స్‌ టెండరింగ్‌ విధానం, గ్రామ సచివాలయాలు, జ్యూడిషయరీ రివ్యూ, ఎస్‌ఈబీ వంటి వ్యవస్థలకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్‌. ఇప్పుడు పరిపాలన వ్యవహరంలోనూ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా జగన్‌ అడుగులు వేస్తున్నట్టు కన్పిస్తోంది. ఇప్పటికే ప్రతి జిల్లాకు అదనంగా ఇద్దరేసి జేసీలను నియమించారు. ఈ నియామకంతో పరిపాలన పరంగా మరింత వెసులుబాటు.. జవాబుదారీ తనం పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ సీఎం.

 

లక్ష్యాలను అధిగమించడానికి నిర్ణయాల విషయంలో సీఎం జగన్‌ దూకుడుగా ఉన్నారు. అయితే, పరిపాలన విభాగంలో కొద్ది మంది దూకుడుగా పనిచేయలేకపోతున్నారన్న చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సచివాలయంలో, సీఎం కార్యాలయంలో జగన్‌ స్పీడ్‌ను అందుకునే అధికారులు ఉండాల్సిన అవసరం ఉంది. దీంతో వీలైనంత త్వరలో పరిపాలన పారంగా సీఎం కొన్ని కీలక నిర్లయాలు తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ సీఎం ప్రక్షాళన కార్యక్రమాన్ని ముందుగా తన కార్యాలయం నుంచే ప్రారంభించినట్లు వైసీపీ వర్గాల్లో టాక్‌ విన్పిస్తోంది.

 

ప్రక్షాళనలో భాగంగా ఇప్పటి వరకు సీఎంఓలో ఉన్న ముగ్గురు రిటైర్డ్‌ ఐఏఎస్‌లను  బాధ్యతల నుంచి తప్పించారు. ప్రస్తుతం సీఎంఓలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ సలహాదారు అజేయ్‌ కల్లాం, పీవీ రమేష్‌, జే. మురళీలను బాధ్యతల నుంచి తప్పిస్తూ సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆ ముగ్గురు అధికారులు పర్యవేక్షిస్తున్న బాధ్యతలను మిగిలిన సీఎంఓ అధికారులైన ప్రవీణ్‌ ప్రకాష్‌, సాల్మాన్‌ ఆరోఖ్య రాజ్‌, ధనుంజయ్‌ రెడ్డిలకు కేటాయించారు. 

 

సీఎంఓలో ఈ తరహా మార్పులు చేర్పులు ఉంటాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. సీఎం నిర్ణయంతో ప్రవీణ్‌ ప్రకాష్‌ సీఎం కార్యాలయంలో మరింత కీలకం కానున్నారు. ఇదే తరహాలో పరిపాలనా వ్యవహారాల్లో కూడా త్వరలోనే ప్రక్షాళన ఉంటుందనే టాక్‌ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: