ఏపీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. మరికొన్ని జిల్లాలు కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. సీఎం సొంత జిల్లా కడపలో గత కొన్ని రోజులుగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే జిల్లాలో 294 కరోనా కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 4361కు చేరింది. 
 
రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైరస్ ను అదుపు చేయాలనే ఉద్దేశంతో కడప జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటినుంచి జిల్లాలో లాక్ డౌన్ ను అమలు చేయనున్నారు. అధికారులు ఉదయం 10 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు, ఇతర వస్తువుల కొనుగోలుకు అనుమతులు ఇవ్వనున్నారు. అధికారులు, పోలీసులు ఉదయం 10 గంటల తరువాత దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. 
 
పోలీసులు ప్రజలు కరోనా నివారణ కోసం సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోను బయటకు రాకూడదని అధికారులు సూచించారు. కరోనా నివారణకు ప్రజలు సహకరించాలని... నిబంధనలు అతిక్రమించి బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే నెల్లూరు జిల్లాలో లాక్ డౌన్ అమలవుతోంది. నెల్లూరు జిల్లాలోని గూడూరు, ఆత్మకూరు, వెంకటగిరి, కావలి, సంగం, సూళ్లూరుపేటలతో పాటు నెల్లూరు అర్బన్ లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా కేసులు నమోదవుతూ ఉండటంతో జిల్లాలోని కొన్ని మండలాల్లో లాక్ డౌన్ అమలవుతున్నట్టు తెలుస్తోంది. జగన్ సర్కార్ కరోనా గురించి పూర్తి సమాచారం కోసం కోవిడ్ 19 ఆంధ్రప్రదేశ్ పేరుతో యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: