గడిచిన ఐదు నెలలుగా కరోనా వైరస్ విజృంభణ వల్ల దేశంలోని ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. దేశంలో కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతున్నాయి. అయితే ఇదే సమయంలో భారతీయులు కరోనాకు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని సంతరించుకుంటున్నారు.
ఢిల్లీలో ఇప్పటికే లక్షల మందిలో కరోనా యాంటీబాడీలు శరీరంలో అభివృద్ధి చెందినట్లు వార్తలు రాగా తాజాగా ముంబైలోనూ 74 లక్షల మందిలో కరోనా యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చేసిన సెరో-సర్వే ద్వారా తేలింది. ముంబై మొత్తం జనాభా కోటీ 85 లక్షలు కాగా దాదాపు 40 శాతం మందిలో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు అభివృద్ధి చెందడంతో వైరస్ ను జయించడానికి ఎంతో సమయం పట్టదని నిపుణులు చెబుతున్నారు.
అధికారులు ముంబైలో నిరుపేదలు నివశించే స్లమ్స్ లో, మధ్య తరగతి ప్రజలు నివశించే రెసిడెన్షియల్ సొసైటీల్లో ఈ సర్వే జరిపారు. 6,936 మందిని పరీక్షించి సర్వే ఫలితాలను వెల్లడించారు. స్లమ్స్ లో నివశించే వాళ్లలో 57 శాతం మంది కరోనా ప్రభావానికి గురై వైరస్ కు వ్యతిరేకంగా యాంటీ బాడీలను తయారు చేసుకున్నారని... రెసిడెన్షియల్ సొసైటీల్లో నివశించే వాళ్లలో 16 శాతం మందిలో యాంటీ బాడీలు వృద్ధి చెందినట్లు తేలిందని అధికారులు తెలిపారు.
కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో ఒక సంస్థ చేసిన పరిశోధనల్లో 47 లక్షల మందికి కరోనా సోకి వారిలో యాంటీబాడీలు కూడా వృద్ధి చెందినట్లు తేలింది. సామూహిక రోగ నిరోధక శక్తి శరీరంలో అభివృద్ధి చెందితే వైరస్ సోకినా ఎటువంటి లక్షణాలు కనిపించకుండానే కనుమరుగవుతుంది. గతంలో భారీగా కేసులు నమోదైన ముంబైలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నగరంలో కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 68 రోజుల సమయం పడుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి