భారీ వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు తెలంగాణకు వచ్చిన కేంద్ర బృందం... తొలిరోజు హైదరాబాద్ పాతబస్తీలోనూ, సిద్ధిపేట జిల్లాలోనూ పర్యటించింది. స్థానికులు, రైతుల్ని అడిగి జరిగిన నష్టాన్ని తెలుసుకుంది. చీఫ్‌ సెక్రటరీ సోమేష్‌కుమార్‌తోనూ సమావేశమై చర్చించారు... కేంద్ర బృందం సభ్యులు.

తెలంగాణలో వర్షాలు, వరదలు కలిగించిన నష్టాన్ని అంచనా వేసేందుకు... కేంద్ర బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తోంది. హైదరాబాద్‌ చేరుకోగానే ముందుగా సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ఉన్నతాధికారులతో సమావేశమైంది... కేంద్ర బృందం. అధిక వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టానికి సంబంధించిన వివరాలను వారికి వివరించారు... అధికారులు. నష్టానికి సంబంధించి ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. మీటింగ్‌ తర్వాత... ఒక బృందం హైదరాబాద్‌ పాతబస్తీలో, మరో బృందం సిద్ధిపేట జిల్లాలో పర్యటించాయి.

హైదరాబాద్‌ పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో... ముంపు ప్రాంతాల్ని పరిశీలించింది... ఐదుగురు సభ్యుల కేంద్ర బృందం. అల్‌జబెల్ కాలనీ, ఘాజీ మిల్లత్, బాబానగర్‌ వీధుల్లో తిరుగుతూ... వరద బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు... బృంద సభ్యులు. ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ కూడా కేంద్ర బృందాన్ని కలిసి.. పాతబస్తీలో జరిగిన విధ్వంసాన్ని, నష్టాన్ని వివరించారు.

మరో కేంద్ర బృందం... సిద్ధిపేట జిల్లా ములుగు మండలంలోని చిన్న తిమ్మాపూర్‌, అన్నాసాగర్‌, ములుగు గ్రామాలతో పాటు... మర్కూక్ మండలం, గజ్వేల్ మండలాల్లోని పలు గ్రామాల్లో పంట నష్టాన్ని పరిశీలించింది. వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తి, వరి, కూరగాయ పంటల వివరాలను రైతులను అడిగి తెలుసుకుంది. జిల్లా కలెక్టర్ కూడా కేంద్ర బృందం వెంట ఉండి... జరిగిన నష్టాన్ని వివరించారు.

ఇటీవల కురిసిన వర్షాలతో తెలంగాణ తడిసి ముద్ద అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు జిల్లాల్లో పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ ఎత్తున నష్టం వాటిల్లడంతో.. కేంద్ర బృందం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: