సైనికుడైన మంగయ్య అమ్మవారికి శమీపూజ, పారువేటోత్సవాలు నిర్వహించగా, తర్వాత కాలంలో రైటర్‌గా ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌కు ఆ అవకాశం దక్కేది. కాలక్రమంలో ఎస్‌ఐ లేదా సీఐగా విధులు నిర్వహిస్తున్న అధికారులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేటప్పుడు తమ ఆయుధాలను శమీ వృక్షంపై భద్రపరుస్తారు. అయితే... అజ్ఞాతవాసం పూర్తయ్యాక విజయ దశమి రోజున అర్జును వాటిని కిందకు దింపి పూజించాక పాండవులు వాటిని ధరిస్తారు. అయితే దసరా ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై జరిగే పారువేట ఉత్సవంలో పాల్గొనే పోలీసు అధికారిని సాక్షాత్తుగా అర్జునుడికి ప్రతిరూపంగా భావించి పూజా కార్యక్రమాలను జరిపిస్తారు. పీఠలపై కూర్చొని అమ్మవారికి పూజ చేసే అవకాశం ముఖ్యమంత్రులు, గవర్నర్లు వంటి ఉన్నత పదవుల్లో గల వాళ్లకు కూడా దక్కదు. కానీ... పారువేట సందర్భంగా వన్‌టౌన్‌ పోలీసులకు ఆ భాగ్యం లభిస్తుంది.

కుల-మతాలకు అతీతంగా అక్కడి స్టేషన్‌కు ప్రధాన అధికారిగా ఎవరుంటారో వాళ్లకే అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం దక్కుతుంది. గతంలో ఓ క్రిస్టియన్... తర్వాత ముస్లిం అధికారి అమ్మవారి పుట్టివారిగా పీఠలపై కూర్చొని పూజలు చేశారు. అమ్మవారే స్వయంగా వాళ్లను తమ వద్దకు రప్పించుకుందని... వాళ్లతో  పూజ చేపించుకుంటోందని అందరూ నమ్ముతారు.

కొండపై పూజా కార్యక్రమాలు ముగిశాక... పుట్టిలుగా భావించే పోలీస్‌ స్టేషన్‌కు వస్తారు అమ్మవారు. శమీపూజలో కూర్చున్న పోలీసు అధికారి... అమ్మవారిని కిందకు తీసుకొస్తారు. పోలీస్‌ స్టేషన్లో అమ్మవారికి పసుపు-కుంకుమలు అందజేస్తారు అధికారులు. తర్వాత అందర్నీ ఆశీర్వదించి... సూర్యోదయానికి ముందే తిరిగి కొండపైకి చేరుకుంటారు. అమ్మవారిని తిరిగి కొండపైకి పంపడంతో  స్టేషన్లో పాడ్యమి రోజు కలశ స్థాపనతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు ముగుస్తాయి.

ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా అత్యంత వైభవోపేతంగా బెజవాడ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. కరోనా నిబంధనల్ని పాటిస్తూ పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు అధికారులు. మొత్తానికి దుర్గమ్మ అమ్మవారి పుట్టినిల్లు ఏంటో తెలిసిన భక్తులకు ఆశ్చర్యం కలుగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: