గతంలో కొన్నేళ్ల క్రితం ప్రజల శ్రేయస్సు దృష్ట్యా, వారి సమస్యల పరిష్కారానికై నక్సల్స్ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అలుపెరుగని పోరాటం చేసేవారు. కానీ రాను రాను తర్వాత కాలంలో వారి ఆలోచన, ఆచరణ పద్ధతుల్లో వచ్చిన మార్పులు, ప్రభుత్వ విధానాలలో వచ్చిన మార్పుల కారణంగా నక్సలిజం వలన కలిగే ప్రయోజనాలు పెద్దగా లేవని భావించి భవిష్యత్ దృష్ట్యా జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత జిల్లా దంతెవాడలో 10 మంది మహిళలు సహా వివిధ విభాగాలకు చెందిన 32 మంది లొంగిపోయినట్లు పోలీసులు ఆదివారం వెల్లడించారు. మావోయిస్ట్ పార్టీ కాలం చెల్లిన సిద్ధాంతాలతో విసిగి వేసారి.. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస కార్యక్రమానికి ఆకర్షితులై వీరంతా లొంగిపోయినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ వెల్లడించారు. భద్రతా కారణాల రీత్యా వారి పేర్లు వెల్లడించడం లేదని తెలిపారు.

లొంగిపోయిన 32 మంది మావోయిస్టులు దండకారణ్య ఆదివాసీ కిసాన్‌ మజ్దూర్‌ సంఘటన్‌, క్రాంతికారి మహిళా ఆదివాసీ సంఘటన్‌, చేత్న నాట్య మండలి, జనతనా సర్కార్‌ గ్రూప్ తదితర విభాగాలకు చెందిన వారని ఎస్పీ పేర్కొన్నారు. తాజాగా లొంగిపోయిన వారిలో కొందరికి గతంలో పోలీసులు, పోలింగ్‌ సిబ్బందిపై దాడి ఘటనలతో సంబంధం ఉంది... నలుగురిపై తలో రూ.1లక్ష చొప్పున రివార్డు కూడా ఉందని ఎస్పీ తెలిపారు. లొంగిపోయిన వారికి తక్షణ సాయం కింద రూ.10వేల చొప్పున అందజేశారు. ప్రభుత్వం ప్రకటించిన పునరావాస ప్యాకేజీని అందించనున్నారు.
బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బకేలి గ్రామానికి చెందిన 19 మంది, కోర్కుట్టికి చెందిన నలుగురు, ఉడేనర్, తుమరిగుండ, మటాసీ గ్రామాలకు ముగ్గురేసి చొప్పున ఉన్నారన్నారు. ఉద్యమాలను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని స్థానిక పోలీసులు పిలుపునకు స్పందించారని, మావోయిస్ట్ డొల్ల సిద్ధాంతాలకు విసిగిపోయారని పేర్కొన్నారు. పోలీసులు చేపట్టి క్యాంపన్ కారణంగా ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 150 మంది నక్సల్స్ దంతేవాడ జిల్లాలో లొంగిపోయారని అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: