తెలుగుదేశం పార్టీ పుట్టింది హైదరాబాద్ లో. ఈ సంగతి ఇప్పటితరంలో చాలా మందికి తెలియదేమో, సహజంగా ఎక్కడైనా పుట్టిన చోటున బలం ఉంటుంది. అది వారి జన్మ హక్కుగా కూడా ఉంటుంది. ఇక మరో విశేషం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ తెలంగాణా నిండా అభిమాన జనం ఉన్నారు. క్షేత్ర స్థాయిలో పట్టుంది. కానీ అటువంటి చోట గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతూంటే చంద్రబాబూ తొంగి చూడడంలేదు, లోకేష్ బాబు ఆ వైపు రావడం లేదు.

నిజంగా ఇది వింతా విచిత్రమే. ఎందుకంటే ఎన్నికలు అనగానే చంద్రబాబు ఎంతటి హుషార్ చేస్తారో అందరికీ తెలిసిందే. ఆయన హడావుడి మామూలుగా ఉండదు, మొత్తం పార్టీని సమాయత్తం చేసి తాను మైకు పట్టుకుని ఊరూ వాడా తిరుగుతూనే ఉంటారు. ఆఖరి నిమిషం వరకూ అలసిపోకుండా ప్రసంగాలు చేస్తూనే ఉంటారు.

ఇపుడు చూస్తే చంద్రబాబు ఖాళీగానే ఉన్నారు. అది కూడా హైదరాబాద్ నడిబొడ్డున కూర్చుని ఉన్నారు. తన ఇంట్లోనే  ఆయన ఉంటూ ఆంధ్రా మీద దృష్టి పెట్తి జూమ్ యాప్ ద్వారా ప్రతీ రోజు ఏపీ పాలిటిక్స్ ని సీరియస్ గానే నడిపిస్తున్నారు. అటువంటి బాబు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మీద ఒక్క కామెంట్  అయినా చేయకపోవడం దారుణమే.

ఇక చినబాబు లోకేష్ ఈ మధ్యన అంతా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇపుడు సరిగ్గా ప్రచారం మొదలైన వేళ ఆయన కారు తీసుకుని విజయవాడ వైపు వచ్చేశారు. ఆయన కారుని మధ్యలో తెలంగాణా పోలీసులు ఆపి తనిఖీలు కూడా చేశారని వార్తలు వచ్చాయి. మొత్తానికి చూసుకుంటే వూరంతా సందడిగా ఉంటే నాకేం పని అన్నట్లుగా  విజయవాడ వచ్చేసి చినబాబు ఇక్కడ అర్జంటుగా చేసే పాలిటిక్స్  ఏంటో అర్ధం కాక అటూ ఇటూ తమ్ముళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

ఇక లోకేష్ 2016 గ్రేటర్  ఎన్నికల వేళ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు, మొత్తానికి మొత్తం గ్రేటర్ హైదరాబాద్ అంతా ఆయన చుట్టబెట్టాదు. ఫలితంగా ఒకే ఒక్క సీటు వచ్చింది. దాంతో ఈసారి అలాంటి ఆయాసం ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ ఆ వైపునకు తొంగి చూడలేదని సెటైర్లు అయితే పడుతున్నాయి. మరి ఇంతకీ టీడీపీ ఈసారి ఇద్దరు బాబులూ లేకుండానే ప్రచారం చేసుకుంటోంది. ఎన్ని సీట్లు వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: