గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికలు కాదు కానీ  మాటల తూటాలే పేలుతున్నాయి. అటూ ఇటూ బాంబులే వేసుకుంటున్నారు. ఇందులో ఎవరూ తక్కువ కాదన్నట్లుగా వీర లెవెల్లో మాటలతో ఫైట్ చేసేస్తున్నారు. నిజానికి కెసీయార్ అసలైన మాటకారి. ఆయన ఇంకా బరిలోకి దిగలేదు. ఈలోగా బీజేపీ నేతలు ఫైర్ బ్రాండ్ లీడర్లు రంగంలోకి దిగిపోయారు. మజ్లీస్ ని రెచ్చగొట్టారు.

ఇపుడు ఒవైసీ బ్రదర్స్ కూడా దూకుడు పెంచారు. అసదుద్దీన్ ఒవైసీ అయితే పాత బస్తీలో రోహింగ్యాలు ఉన్నారంటే అది బీజేపీ కేంద్ర సర్కార్ చేతగానితనం కాదా అంటూ రివర్స్ అటాక్ చేశారు. బీజేపీ పాకిస్థాన్, మతం కార్డు లేకుండా ఒక్క ప్రసంగం చేయగలదా అని అసదుద్దీన్ గర్జించారు. ఆయన సోదరుడు అక్బ‌రుద్దీన్ ఓవైసీ అయితే పీవీ నరసింహారావు, ఎన్టీయార్ ఘాట్ ల గురించి ప్రస్తావించి రచ్చ రేపారు.

వాటి జోలికొస్తే మీ ఆఫీస్ దారూసలం ని రెండు గంటల్లో కూలగొట్టేస్తామంటూ బీజేపీ నేతలు ఈ వైపు నుంచి గట్టిగా తగులుకున్నారు. ఇక విజయశాంతి అయితే అక్బరుద్దీన్ దేశ నాయకుల ఘాట్స్ గురించి మాట్లాడుతున్నారు. రేపొద్దున తాజ్ మహల్, చార్మినార్ స్థలాభావం అంటూ ఎవరైనా కూలగొట్టాలన్న ఆలోచనలు చేశారంటే ఆ తప్పు అక్బరుద్దీన్ దే అవుతుందని హాట్ హాట్ కామెంట్స్ చేశారు.

ఇక మతం కార్డు తో ముందుకుపోవాలనుకుంటున్న బీజేపీ మజ్లీస్ ని ఎక్కడ గిల్లాలో అక్కడ గిల్లేసింది. దాంతో ఓవైసీ సోదరులు కూడా గట్టిగానే నోరు విప్పాల్సివస్తోంది. ఈ వివాదం ఎటు వైపు తిరిగినా కూడా బీజేపీకి లాభమే. ఇంతకీ పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారా లేరా అన్న చర్చ అయితే సక్సెస్ ఫుల్ గా జనంలోకి బీజేపీ పంపించింది అనుకోవాలి.  మరి ఇదే రకంగా దూకుడు గా కమలం పార్టీ మరింత ముందుకు సాగితే మజ్లీస్ కోటలో పాగా వేసేందుకు వీలుంటుందేమోనని అంచనా వేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: