బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రంగా మారడంతో ఇది తీవ్ర తుఫాన్‌గా మారిందని భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్‌కు నివర్ (Nivar) అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ పేరును ఇరాన్ సూచించిన సంగతి కూడా విదితమే. ఇక ఈ నివర్ తుఫాన్ కారణంగా తమిళనాడులోని సముద్ర తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. ఈ తుఫాన్ ప్రభావం తమిళనాడులోనే కాకుండా ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాలపై కూడా తీవ్రంగా ఉంది. ఇకపోతే ఈ నివర్ తుఫాన్ ప్రభావం రైళ్లపైనా పడింది. ఈ తుఫాన్, భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. చెన్నై సెంట్రల్‌- తిరుపతి రైలును రైల్వే శాఖ రద్దు చేసింది. అలాగే హైదరాబాద్‌- తంబరం, మధురై- బికనీర్‌, చెన్నై సెంట్రల్-సంత్రగచ్చి రైళ్లు రద్దు అయ్యాయి. తుఫాన్‌ ప్రభావంతో పలు రైళ్లను దారి మళ్లించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నడిచే 8 రైళ్లు దారి మళ్లింపు, ఒక రైలు రద్దు చేశారు. ఏపీ, తెలంగాణ మీదుగా నడిచే 7 రైళ్లను రద్దు చేసి, ఎనిమింటిని దారి మళ్లించారు. ప్రయాణికుల సహాయార్థం సికింద్రాబాద్‌ 040-27833099, విజయవాడ 0866-2767239, గుంతకల్‌ 7815915608, గుంటూరు 0863-2266138 హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు.

ఇక ఈ నివర్ తుఫాన్ పుదుచ్చేరి సమీపంలో తీరం దాటింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్‌ తీరం దాటినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరితో పాటూ ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. స్థానికుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎన్డీఆర్‌ఎఫ్ టీమ్‌లు కూడా రంగంలోకి దిగాయి. ఓడ రేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: