గ్రేటర్ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరింది. దీంతో అన్ని పార్టీలు తమ అమ్ముల పొదిలోని శక్తిమంతం అయిన అస్త్రాలను ఉపయోగిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ తరఫున కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రచారం చేశారు. ఆయన ప్రచారంతో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ వ్యూహాలన్నీ పూర్తయినట్లే. ఇక అధికార టీఆర్ఎస్ కూడా తక్కువేమీ కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ పెట్టి బీజేపీపై తీవ్రమైన విమర్శలు చేశారు.

గ్రేటర్ ఎన్నికలకు కేంద్ర మంత్రులతో ప్రచారం అవసరమా? అంటూ బీజేపీ నేతలను నిలదీశారు. కేసీఆర్ ప్రసంగంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. దీంతో ఈరోజు కూడా అదే ఊపు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన నిప్పులు చెరిగారు. ఎన్నికలు అనగానే పరిగెత్తుకొని వచ్చిన కేంద్ర మంత్రులు హైదరాబాదు‌కు ఏం తెచ్చారని అడిగారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆరేళ్లలో హైదరాబాద్‌కు ఏం ఇచ్చింది? అని సూటిగా ప్రశ్నించారు.

'హైదరాబాద్‌లో ఎలాంటి గొడవలు, కర్ఫ్యూలు లేవు. ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంది కాబట్టే పెట్టుబడి దారులు క్యూలు కడుతున్నారున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు. ఈ విశ్వనగరాన్ని కొందరి హైదరాబాద్‌గా  మార్చడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షలు ఎంతమందికి వేశారు? వరద సమయంలో మీలో ఎవరైనా ఇక్కడకు వచ్చారా? మరి ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు వస్తున్నారు? వరదలు వచ్చినప్పుడు మంత్రులతో కలిసి నగరంలో తిరిగాం.

వరద సాయం ఇవ్వాలని అనుకుంటే, టీఆర్ఎస్‌కు మంచి పేరు వస్తుందనే ఒకే ఒక్క కారణంతో ఈ సాయాన్ని అడ్డుకున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి కిషన్‌రెడ్డి ఒక్క రూపాయి అయినా తెచ్చారా? కేంద్రం మనకిచ్చిన దాని కంటే.. మనమే ఎక్కువ ఇచ్చాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: