గ్రేటర్ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. నిన్న సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి బ్రేకులు పడగా రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలుకానుంది. అయితే గత అనుభవాల దృష్ట్యా రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా డ్రైడే అమల్లోకి వచ్చింది. రేపు సాయంత్రం 6 గంటల వరకు అంటే ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు గ్రేటర్ పరిధిలో మద్యం షాపులు మూసివేయనున్నారు. మందు దొరకని కారణంగా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు చేపట్టినా సరఫరా చేసినా లేదా ఇతర ప్రాంతాల నుంచి గ్రేటర్ పరిధిలో కి మద్యం బాటిళ్లు తీసుకువచ్చినా వారికి జైలు శిక్ష తప్పదని ఆబ్కారీ శాఖ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

అంతే కాదు వైన్ షాప్ నిర్వాహకులు లేదా బార్ అండ్ రెస్టారెంట్ నిర్వాహకులు ఈ మద్యం అమ్మకాలను అక్రమంగా చేపడితే కనుక వారి లైసెన్సులు కూడా రద్దు చేసేందుకు వెనకాడమని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. ఓటర్లను మద్యంతో ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవాలని చూసే రాజకీయ పార్టీలు మీద కఠిన చర్యలు తీసుకుంటామని అబ్కారీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఈ రెండు రోజులు మద్యం విక్రయాలు కానీ సరఫరాలను అరికట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 17 ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ఇవి కాకుండా ప్రతి అబ్కారీ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ బృందాలు, ఒక్కో యూనిట్ కి నాలుగు డిటిఎస్ బృందాలు నాలుగు ఎన్ఫోర్స్మెంట్ బృందాలు పర్యవేక్షించనున్నట్లు సమాచారం. గ్రేటర్ పరిధిలో ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 45 చెక్ పోస్టులలో పోలీసులు ఆర్టిఏ అధికారులతో కలిసి అబ్కారీ శాఖ అధికారులు కూడా ఇప్పటికే తనిఖీలు నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు అయిన రాజేంద్ర నగర్, సరూర్ నగర్ ధూల్పేట, నాంపల్లి జూబ్లీహిల్స్, మల్కాజిగిరి వంటి ప్రాంతాల్లో కూడా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: