జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. డిసెంబరు1న ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. యాభై వేలకు పైగా పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. పూర్తిగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈసీ సూచించిన 21 గుర్తింపు కార్డుల్లో ఏ ఒక్క కార్డున్నా..ఓటు వేసే అవకాశం కల్పించారు.

డిసెంబర్ 1న జ‌రిగే జీహెచ్‌ఎంసీ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. గ్రేటర్‌ పరిధిలో మొత్తం ఓటర్లు 74 లక్షల 44 వేల 260 మంది ఉన్నారు.  ఇందులో పురుషులు 38 లక్షల 76 వేల 688 కాగా.. స్త్రీలు 35 లక్షల 65 వేల 896. ఇతరులు 676 మంది ఉన్నారు. మొత్తం వార్డుల సంఖ్య 150 కాగా.. 1122 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

ఇక.. ఫ్లయింగ్ స్క్వాడ్‌ల సంఖ్య  60 కాగా..30 స్టాటిస్టిక్ సర్వేలెన్స్ టీమ్‌లు ఎన్నికల కోసం పని చేస్తాయి. మొత్తం పోలింగ్ సిబ్బంది 48 వేల మంది విధులు నిర్వహిస్తారు. గ్రేటర్‌ ఎన్నికల కోసం 28 వేల 683 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు.  పోస్టల్ బ్యాలెట్ల కోసం 2 వేల 831 దరఖాస్తులు వచ్చాయి.

డిసెంబర్ 1న ఉదయం 5:30 గంట‌ల వ‌ర‌కు ఎన్నిక‌ల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 6 గంట‌ల‌కు పోలింగ్ ఏజెంట్లు హాజ‌రు కావాల్సి ఉంటుంది. ఉదయం 6 గంట‌ల నుంచి 6:15 గంట‌ల మ‌ధ్య మాక్ పోలింగ్ జ‌రుగుతుంది. ఉదయం 6:55 గంట‌ల‌కు బ్యాలెట్ బాక్సులను సీల్ చేస్తారు పోలింగ్ సిబ్బంది. ఉదయం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంట‌ల‌కు పోలింగ్ పూర్తవుతుంది.

కొవిడ్-19 పాజిటివ్ ఉండి పోస్టల్ బ్యాలెట్ పొందలేని ఓటర్లకు ప్రత్యేక లైన్ ద్వారా ఓటువేసే అవకాశం కల్పిస్తున్నారు. ఓట‌రు గుర్తింపు కార్డులేని ఓట‌ర్ల‌కు ఎంపిక చేసిన 21 ఇత‌ర గుర్తింపు కార్డులు ఉన్నా ఓటు వేసే అవ‌కాశం ఉంది. ప్ర‌తి పోలింగ్ స్టేష‌న్‌లో వృద్దులు, విక‌లాంగుల‌కు ప్ర‌త్యేక క్యూలైన్ల ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 9 వేల 101 పోలింగ్ స్టేషన్లలో 1752 హైపర్ సెన్సిటివ్, 2934 సెన్సిటివ్, 4415 నార్మల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం 52 వేల 500 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. 150 పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నేషన్ సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగిస్తారు.
కొవిడ్-19 నిబంధనలను అనుసరించి ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ముందురోజే శానిటైజేషన్ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: