ఐటీ ఉద్యోగులకు ఈ సారి అవకాశం లభించింది. ఓటు వేయాలనే ఉన్నా సెలవులు లేకపోవడం.. సుదూర ప్రాంతాల్లో ఉండటం.. టెక్కీలను ఓటుకు దూరం చేసేది. కానీ.. కరోనా పుణ్యమా అని వర్క్‌ ఫ్రం హోమ్‌లోనే ఉన్నారు టెక్కీలు. రోజు మొత్తంలో ఓ గంట కేటాయిస్తే.. ఓటేసి రావొచ్చు. మరి ఈ సారైనా ఐటీ ఉద్యోగాలు ఓటు హక్కు వినియోగించుకుంటారా?

ఓటు హక్కును ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని ప్రతీ ఎలక్షన్‌కి ఈసీ.. జోరుగా ప్రచారాలు చేస్తోంది. ఎన్నడూ లేనంతగా అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. అయినా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం ఓటింగ్‌ పెరగడం లేదు. ఓటింగ్ రోజును హాలీడేగా ఫీలయ్యేవారు కొందరుంటే, ఓటేయాలనున్నా.. రకరకాల ఇబ్బందులతో దూరంగా ఉంటున్నవారు మరికొందరు. ఇలా ఓటింగ్‌కు దూరమవుతున్నవారిలో  ఎక్కువ శాతం ఐటీ ఉద్యోగులే. ఓటు వేయాలనే ఉన్నా.. సుదూర ప్రాంతాల్లో ఉండటం, సెలవులు లేకపోవడం.. వారిని ఓటుకు దూరం చేస్తోంది.

ఐటీ ఉద్యోగాలంటేనే రాష్ట్రాలు, దేశాలు దాటి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన రాష్ట్రానికి చెందిన వారు 35 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా.. అందులో 24 లక్షల మంది బెంగుళూరు, పుణె, చెన్నై, కోల్‌కత్తా వంటి పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్నారు. సుమారు 5 లక్షల మంది వరకు ఇతర దేశాల్లో ఉన్నారు. ఇందులో 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నవారు కనీసం 5 శాతానికి కూడా మించట్లేదు. శుభ, అశుభ కార్యాలకు కూడా సొంతూరుకు రాలేని పరిస్థితుల్లో ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నారు ఐటీ ఉద్యోగులు.

నగరంలో ఓటుహక్కు ఉన్నప్పటికీ దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేసేవారు ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. సెలవుపై ఇంటికి వద్దామనుకున్నా.. సుదూర ప్రాంతాలు కావడంతో రాకపోకలకే రెండు రోజుల టైం పడుతోంది. మొత్తంగా ఐదు రోజుల పాటు లీవ్‌ పెట్టాల్సి వస్తోంది. ఒక ఐటీ కంపెనీలో ఇన్ని రోజులపాటు సెలవు అంటే సాధ్యమయ్యే పని కాదంటున్నారు ఐటీ ఉద్యోగులు.

ఈ సారి మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. లాక్‌డౌన్‌ కు ముందు నుంచే చాలావరకు ఐటీ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లోనే ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి వరకు ఇదే విధానాన్ని కంటిన్యూ చేయనున్నాయి. దీంతో.. ఐటీ ఉద్యోగులు ఇంటికే పరిమితమయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఓటు హక్కుకు దూరమవుతున్న ఐటీ ఉద్యోగులకు బల్దియా ఎన్నికల్లో ఓటు వేసే ఛాన్స్‌ లభించింది. రోజు మొత్తంలో ఓ గంటసమయం కేటాయిస్తే  ఓటు వేయడం అంత కష్టమేమీ కాదు. ఐదేళ్ల భవితను నిర్దేశించే నాయకుడిని ఎన్నుకోవడంలో చదువుకున్న ఐటీ ఉద్యోగ యువతే ముందుకు రాకుంటే ఎలా.? ఈ సారైనా ఐటీ ఎంప్లాయిస్ ఓటేస్తే పోలింగ్ శాతం బాగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: