టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌పై మాటలతూటాలు పేలుతున్నాయి. డిసెంబర్ నెలాఖరుకు రైతులకు పరిహారమిస్తామని స్పష్టంగా చెబుతున్నా.. విపక్ష సభ్యులకు అర్థం కావడం లేదన్నారు సీఎం జగన్. అయితే రైతు సమస్యలపై పోరాడుతుంటే తమను సస్పెండ్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. సభలో చర్చ జరిగితే నిలదీస్తామనే... ప్రభుత్వం పారిపోయిందని టీడీపీ సభ్యులు విమర్శించారు.

ఏదైనా అంశంపై మాట్లాడినప్పుడు పై కంపార్ట్‌మెంట్‌లో కాస్త్ సెన్స్ ఉండాలన్నారు సీఎం జగన్. డిసెంబర్ 15నాటికి నష్టం అంచనాలు పూర్తి చేసి , నెలాఖరుకు పరిహారమివ్వాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు . ఇంత చేసినా ఇంకా ఇలాగే మాట్లాడితే ఎలా అన్నారు సీఎం జగన్.

వరద నష్టంపై ప్రభుత్వం గాలి కబుర్లు చెబుతోందన్నారు విపక్ష నేత చంద్రబాబు. సభలో సీఎం తీరుతో తొలిసారి తనకు కోపం వచ్చిందన్నారు. అందుకే పోడియం ముందు బైఠాయించానన్నారు. జగన్ ఓ ఫేక్ సీఎం అన్న చంద్రబాబు.. వైసీపీ వాళ్లు గాలికే వచ్చారని, గాలికి పోతారన్నారు.

వైసీపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రైతు సమస్యలపై చర్చించకుండా అధికార పార్టీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. ధాన్యం ధర కూడా చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి.

నష్టం వచ్చిన సంవత్సరమే పంటకు పరిహారమిస్తున్నామని, టీడీపీ ఎమ్మెల్యేల ప్రకటనలు పసలేనివంటున్నారు మంత్రులు. అయితే చర్చను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని విపక్ష ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.

మండలిలోనూ అధికార, విపక్షాల మధ్య మాటల మంటలు చెలరేగాయి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో పంటనష్టపరిహారంపై చర్చ వాడివేడిగా జరిగింది.  చంద్రబాబు వ్యవసాయం దండగన్నారని.. మంత్రి బొత్స ఆరోపించారు. లోకేష్‌కు ఏ పంట ఎప్పుడేయాలో తెలియదన్నారు. చంద్రబాబు మనసులో మాట పుస్తకంలో ఈ విషయం ఉందన్నారు మరో మంత్రి బుగ్గన. ఆధారాలతో రుజువు చేయకపోతే.. మాటలు వెనక్కు తీసుకోవాలన్నారు లోకేష్.

 


మరింత సమాచారం తెలుసుకోండి: