పురానాపూల్‌లోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని.. వీటన్నింటిలో రీ-పోలింగ్‌ నిర్వహించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. మంగళవారం రాత్రి సిటీ కాలేజీలోని డీఆర్‌సీ కేంద్రం వద్ద ఆందోళన నిర్వహించారు. చార్మినార్‌ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్, పురానాపూల్‌ బీజేపీ అభ్యర్థి కే.సురేందర్‌ కుమార్‌ ఆధ్వర్యంలో అరగంట పాటు నిరసన కార్యక్రమం జరిగింది. పురానాపూల్‌లోని కొన్ని బూత్‌లను ఆక్రమించుకుని పెద్ద ఎత్తున బోగస్‌ ఓట్లు వేశారని వారు ఆరోపించారు. వెంటనే రీ-పోలింగ్‌ నిర్వహించాలని సిటీ కాలేజీ రోడ్డుపై బైటాయించారు. ఈ సందర్భంగా నగర బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు టీ.ఉమా మహేంద్ర మాట్లాడుతూ.. చార్మినార్‌ ఎమ్మెల్యే తమ అనుచరులతో కలిసి బూత్‌లను ఆక్రమించి బోగస్‌ ఓట్లు వేశారని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా చార్మినార్‌ ఎమ్మెల్యే పోలింగ్‌ బూత్‌లలోకి ప్రవేశించి బీజేపీ ఏజెంట్లను బెదిరించి బోగస్‌ ఓట్లకు పాల్పడ్డారన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో రీ-పోలింగ్‌ నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఉప్పుగూడ డివిజన్‌ బీజేపీ అభ్యర్థి తాడెం శ్రీనివాసరావుపై మజ్లిస్‌ దాడికి యత్నించింది. వివరాల్లోకి వెళితే.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా నర్కీ పూల్‌బాగ్‌లో రిగ్గింగ్‌ జరుగుతుందని ఆరోపణలు వచ్చాయి. పోలింగ్‌ కేంద్రం వద్ద ఉన్న బీజేపీ అభ్యర్థి తాడెం శ్రీనివాసారావు ఆ సమయంలో ఓటరు గుర్తింపు కార్డు లేకుండా ఓటు వేసేందుకు వెళ్తున్న ఓ ఓటరును అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మజ్లిస్‌ నాయకుడు సమద్‌ బిన్‌ అబ్దాద్‌ ఎందుకు అడ్డుకుంటున్నావంటూ ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహానికి గురైన సమద్‌ అక్కడే ఉన్న పూల తొట్టిని పైకి లేపి కిందికి కొట్టాడు. బీజేపీ అభ్యర్థి పక్కకు జరగడంతో ప్రమాదం తప్పింది. వెంటనే స్పందించిన పోలీసులు శ్రీనివాసరావును అక్కడి నుంచి పంపించారు.

జంగమ్మెట్‌ డివిజన్‌లోని 27వ పోలింగ్‌ బూత్‌ వద్ద పోలింగ్‌ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే.. జంగమ్మెట్‌ బస్తీలోని సెయింట్‌ పీటర్‌ పాఠశాలలో 27, 32 పోలిగ్‌ కేంద్రాలున్నాయి. ఉదయం 11 గంటలకు బీజేపీ నాయకురాలు సయ్యద్‌ షహజాది రిగ్గింగ్‌ జరిగిందంటూ అక్కడికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న మజ్లిస్‌ నాయకులు నీవు అభ్యర్థివి కావని.. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డుకున్నారు. దీంతో అక్కడ గొడవ మొదలైంది. అక్కడే ఉన్న పోలీసులు ఇద్దరిని శాంతింపజేశారు. బీజేపీ అభ్యర్థి బైక్‌పై కూర్చొని వెళ్తున్న సమయంలోనే మజ్లిస్‌ కార్యకర్తలు ఆమెను వెంబడించి దాడి చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంటనే మజ్లిస్‌ నాయకులను అడ్డుకున్నారు. ఈ మేరకు బీజేపీ అభ్యర్థి ఛత్రినాక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: