జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం ఉంది అని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ‘పీపుల్స్ పల్స్’ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాల ప్రకారం... టీఆర్ఎస్ కు 68-78 స్థానాలు, బీజేపీకి 25-35 స్థానాలు, ఎంఐఎం కు 38-42 స్థానాలు, కాంగ్రెస్ కు 1-5 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి అని సర్వే పేర్కొంది.టీఆర్ఎస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (76)కు చేరుకునే అవకాశాలు కన్పిస్తున్నాయని, పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం టీఆర్ఎస్, బీజేపీకి మధ్య 6 శాతం ఓట్ల వ్యత్యాసం ఉండే అవకాశముంది అని పేర్కొంది.

 ఈ ఎన్నికల్లో సైలెంట్ వేవ్ కన్పిస్తోంది. సైలెంట్ వేవ్ పని చేస్తే బీజేపీ మరింత లాభపడే అవకాశముంది అని సర్వే తెలిపింది. పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ కు 38 శాతం, బీజేపీకి 32 శాతం, ఎంఐఎం 13 శాతం, కాంగ్రెస్ కు 12 శాతం, ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చే అవకాశముంది. ప్లస్ ఆర్ మైనస్ మూడు శాతం ఉంటుంది అని పేర్కొంది. అనేక మున్సిపల్ డివిజన్లలో బహుముఖ పోటీ ఉండటం, పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడంవల్ల ఆఖరి ఓటు లెక్కించే వరకు గెలుపోటముల విషయంలో ఉత్కంఠ నెలకొనే అవకాశముందని పేర్కొంది.

‘పీపుల్స్ పల్స్’ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం డబుల్ బెడ్రూం ఇండ్లు, నిరుద్యోగం, వరద బాధితులకు సహాయం వంటివి ఈ ఎన్నికల్లో ప్రధానాంశాలుగా నిలిచాయని వెల్లడించింది.     ఈ ఎన్నికల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు 28 శాతం, నిరుద్యోగుల సమస్య 21 శాతం, వరద బాధితులకు సాయం 16 శాతం, ట్రాఫిక్ రద్దీ సమస్య 12 శాతం, రోడ్ల సమస్య 10 శాతం, పారిశుభ్రత 9 శాతం మంది, ఇతర అంశాలు 5 శాతం ప్రభావితం చూపుతున్నాయని, ఈ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా ఓట్లు, సీట్ల శాతాన్ని పెంచుకోగలిగిందని తెలిపింది.

బీజేపీ 2016 ఎన్నికల్లో తెలుగుదేశం పొత్తుతో 4 వార్డులు మాత్రమే గెలుచుకుంది. ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సీట్ల సంఖ్యను 6 రెట్లు పెంచుకోవడం గమనించదగ్గ విషయం అని చెప్పింది.  సైలెంట్ ఓటు పనిచేస్తే బీజేపీ అనూహ్యంగా 40 అంతకు మించి సీట్లకు చేరుకునే అవకాశం ఉంది.    ఎంపీ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ కొంత పోటీ ఇవ్వగలిగింది. సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ పూర్తిగా చతికిలపడిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: