గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎవరికి దెబ్బ పడింది అని ఆలోచిస్తే అది శతాధిక వృద్ధ పార్టీ కాంగ్రెస్ కి అని చెప్పాలి. కాంగ్రెస్ కి గతసారి రెండు సీట్లే వచ్చాయి. ఈసారి అంతే వచ్చాయి. తేడా ఏముంది అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం చెదిరిపోయింది. పైగా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తాన్ని బీజేపీ లాగేసింది. ఈ ఎన్నికల్లో టీయారెస్ తన ఓటు బ్యాంక్ ని కాపాడుకుంది. మజ్లీస్ కి ఓట్లూ సీట్లు బాగానే వచ్చాయి. బీజేపీ మాత్రం అమాంతం విశ్వరూపం చూపించింది. ఎక్కడి నాలుగు సీట్లు. మరెక్కడి నలభై అయిదు సీట్లు. అంటే పదింతల బలం పెరిగింది అన్న మాట.

ఆ బలం ఎలా వచ్చింది అంటే కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి లాగేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మరింతగా దిగజారిపోతే టీడీపీ అనవాళ్ళు  కూడా లేకుండా పోయాయి.  2016 ఎన్నికల్లో ఒక సీటు టీడీపీకి వచ్చిన ఓట్లు బాగానే పడ్డాయి. కానీ ఆ ఓట్లు అన్నీ కూడా ఇపుడు ఏమైపోయాయో తెలియడంలేదు. అంటే ఇవన్నీ నెమ్మదిగా బీజేపీకి షిఫ్ట్ అయినట్లుగా తాజా గ్రేటర్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక కాంగ్రెస్ కి 2018 తరువాత వరస దెబ్బలే తగులుతున్నాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విడిచిపెట్టేసిన హుజూర్ నగర్ సీట్లో ఆయన సతీమణి పోటీ చేసే ఓడిపోయారు. ఆ సీటుని కూడా టీయారెస్ లాగేసుకుంది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మోగిస్తే కాంగ్రెస్ మూడవ స్థానానికి వెళ్ళిపోయింది.

అదే విధంగా గ్రేటర్ ఎన్నికల్లో అయినా కాంగ్రెస్ సీరియస్ గా బరిలోకి దిగిందా అంటే అదీ లేదు. గ్రూప్ తగాదాలతో కాలక్షేపం చేస్తూ వచ్చింది. ఇక కాంగ్రెస్ తరఫున గెలిచిన ఇద్దరూ కూడా వారి వ్యక్తిగత ఇమేజ్ తోనే విజయం సాధించారనుకోవాలి. రేవంత్ రెడ్డి కొన్ని చోట్ల ప్రచారం చేసినా కూడా గెలుపు పిలుపు వినబడలేదు. ఈ ఫలితాల తరువాత కాంగ్రెస్ నుంచి మరిన్ని జంపింగులు బీజేపీలోకి ఉంటాయని అంటున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే కాంగ్రెస్ పని అయిపోయింది అనేస్తున్నారు. మొత్తం మీద గ్రేటర్ ఎన్నికల్లో అతి పెద్ద ఓటమి కాంగ్రెస్ కే దక్కిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: