తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలు, ప్రాజెక్టుల పంచాయితీ కొనసాగుతోంది.  కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు  ఆయా ప్రాజెక్టుల డీపీఆర్ సమర్పించాలని ఇటీవల అపెక్స్ కౌన్సిల్ భేటీలో కేంద్రం ఆదేశించింది.  దీంతో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ డీపీఆర్ ను కేఆర్ఎంబీకి సమర్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.  

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి యుద్ధాన్ని నిలువరించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల అపెక్స్ కమిటీ భేటీ జరగ్గా రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరి వాదన వారు బలంగా వినిపించారు.  కృష్ణా గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో గజేంద్ర సింగ్ షెకావత్ జోక్యం చేసుకొని ఇరు రాష్ట్రాలు ఆయా ప్రాజెక్టుల డీపీఆర్ సమర్పించాలని, తదుపరి ఆదేశాలు వచ్చేదాకా వాటిని ఆపివేయాలని స్పష్టం చేశారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకంతో మొదలైన రగడ ఇరు రాష్ట్రాలు సుప్రీం కోర్టు మెట్లెక్కే వరకు వెళ్లాయి. ఏపీ సర్కార్ జాతీయ హరిత ట్రిబ్యునల్ విచారణ ఎదుర్కొంది . కృష్ణా బోర్డు , గోదావరి నదీ యాజమాన్య బోర్దులకు ఈ పరిణామాలు తలనొప్పిగా మారాయి. దీంతో కేంద్రమంత్రి రంగంలోకి దిగి రెండు నదీ బోర్డుల పరిధి నోటిఫై చేశాక వారి నిర్ణయం మేరకు నీటి వాటా జరుగుతుందని తేల్చి చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని సీఎం కేసీఆర్ దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో సీఎం జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు వేగంగా పావులు కదిపారు. దీనిపై సుప్రీం కోర్టు మెట్లెక్కడంతోపాటు.,   కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది తెలంగాణా ప్రభుత్వం.

తెలంగాణా ప్రభుత్వానికి కౌంటర్ గా ఏపీ కూడా కృష్ణా బోర్డులో తెలంగాణలో ఉన్న సాగునీటి ప్రాజెక్ట్ లపై ఫిర్యాదులు చేశారు .  ఇరు రాష్ట్రాల వాదనలు విన్న కృష్ణా బోర్డు కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్ట్ లకు సంబంధించి సమగ్ర వివరాలను బోర్డుకు ఇవ్వాలని పేర్కొంది. దీంతో ఏపీ ప్రభుత్వం తాజాగా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ డీపీఆర్ ను కేఆర్ఎంబీకి సమర్పించింది.  అపెక్స్ కౌన్సిల్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు  డీపీఆర్ సమర్పించిన ఏపీ సర్కారు.., రాయలసీమ ఎత్తిపోతల కొత్త ప్రాజెక్టు కాదని వాదిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: