ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై ప్రతిపక్షాలు, ముఖ్యంగా టీడీపీ నేతలు ముప్పేట దాడి ప్రారంభించారు. ఆలయాలపై దాడులు, దుష్ప్రచారం వెనక రాజకీయ ప్రమేయం ఉందని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించడంతో టీడీపీ మండిపడింది. టీడీపీ నాయకులంతా పోలీస్ అధికారుల్ని, పోలీస్ బాస్ సవాంగ్ ని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో పోలీసులు, అధికార పార్టీకి తొత్తుల్లా మారిపోయారని మరోసారి మండిపడ్డారు.

రాష్ట్రంలో ఆలయాలపై దాడులు చేసినవారిని, విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని పట్టుకోవడం చేతగాక... సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టిన తమ పార్టీ సానుభూతిపరులను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ నిందితులుగా చూపిస్తున్నారని, అది దుర్మార్గమైన చర్య అని అన్నారు మాజీ మంత్రి నారా లోకేష్. ‘హిందుత్వం మనుగడను ప్రశ్నించేలా దాడులు జరుగుతుంటే నిందితులను పట్టుకోలేక అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న డీజీపీపైౖ కోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలి’ అని డిమాండ్ చేశారు లోకేష్. రాష్ట్రంలో జరిగిన విగ్రహాల ధ్వంసం పిచ్చోళ్లు, దొంగలు, జంతువుల పని అంటూ గౌతమ్ సవాంగ్ ప్రకటించి ఒకరోజు గడవకముందే.. అందులో రాజకీయ కుట్ర కోణం ఉందని మాట మార్చారంటూ మండిపడ్డారు.


అంతర్వేది రథం దగ్ధంతో మొదలైన ఆలయాల వ్యవహారం.. రామతీర్థం ఘటనతో పీక్ స్టేజ్ కి చేరింది. అయితే ఇవన్నీ యాదృచ్ఛిక ఘటనలే అని, ఒకదానితో మరో దానికి పోలిక, పొంతన లేదనేది పోలీసుల వాదన. కానీ ప్రతిపక్షాలు మాత్రం దీన్ని ప్రభుత్వ వైఫల్యంగా చెబుతున్నాయి. ఓ వర్గంపై కావాలనే దాడులు జరుగుతున్నా పట్టించుకోవడంలేదని మండిపడుతున్నాయి. అదే సమయంలో పోలీసులు మాత్రం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, అలా జరుగుతున్న ప్రచారంలో రాజకీయ కుట్ర కోణం ఉందని చెప్పారు. దీంతో ప్రతిపక్షాలు మరోసారి పోలీస్ డిపార్ట్ మెంట్ పై మండిపడ్డాయి. రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులు లేరని, వైపీఎస్ అధికారులున్నారంటూ టీడీపీ నేతలు దుయ్యబడుతున్నారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు యంత్రాంగం వైసీపీ నేతల కొమ్ము కాస్తోందని అంటున్నారు. ముఖ్యంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ ని టార్గెట్ చేసుకుని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వీటికి పోలీస్ బాస్ ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: