గత ఏడాది చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచదేశాలపై ఎంతలా ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే. ఈ కరోనా వైరస్ పుట్టిన సంవత్సరంలోపే ప్రపంచం అంతటా విస్తరించిన మొట్టమొదటి వైరస్ గా చరిత్ర సృష్టించింది. ఇక ఈ వైరస్ వల్ల ప్రపంచం అంతటా లక్షల్లో మరణాలు నమోదు అయ్యాయి. కోట్లల్లో కేసులు ఇంకా నమోదు అవుతూనే ఉన్నాయి. ఇక మన దేశంలోనూ కరోనా తీవ్ర ప్రతాపం చూపుతూనే ఉంది. మన దేశంలో ఈ ప్రాణాంత వైరస్ కారణంగా లక్షన్నర మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ కారణంగా దేశం మొత్తం కూడా తీవ్ర సంక్షోభానికి లోనయ్యింది.

అయితే ఈ మహ్మారి జయించడానికి చాలా దేశాలు టీకాలు, వ్యాక్సిన్ లు కనుగొనే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో భారత సైంటిస్టులు ఈ మహమ్మారికి విజయవంతంగా వ్యాక్సిన్ కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను నరేంద్ర మోడి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడి దేశ పరిస్థితిని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ.. లక్షల మంది వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు దేశం నుంచి కరోనాను తరిమికొట్టేందుకు నిర్విరామంగా పని చేస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారంటూ వారి సేవలను కొనియాడారు. విధుల కోసమని వెళ్లిన సిబ్బందిలో కొంతమంది ఇంటికి తిరిగి రాలేదు అని చెబుతూ ప్రధాని కన్నీళ్లు పెట్టుకున్నారు. 

ఈ వ్యాధి ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని, కరోనా కారణంగా ఎంతోమంది తల్లులు తమ పిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారికి సంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు కూడా నిర్వహించలేని దుస్థితి ఏర్పడిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తల కృషితో దేశంలో రెండు టీకాలు అందుబాటులోకి వచ్చాయని విదేశీ టీకాలతో పోలిస్తే అత్యంత తక్కువ ధరకే ఈ టీకాలు లభిస్తున్నాయని అన్నారు. వ్యాక్సిన్లు వచ్చినప్పటికి  ప్రజలు కరోనా జాగ్రత్తలు మరవొద్దని ప్రధాని మోదీ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: