అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయం వేడి పెరుగుతోంది. ప్ర‌ధానంగా తృణ‌మూల్ కాంగ్రెస్-బీజేపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగుతోంది. ఈ క్ర‌మంలోనే ఇరు పార్టీల నేత‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయ ఉద్రిక్త‌ల‌కు తీసే ప్ర‌మాదం కూడా పొంచి ఉండ‌టంతో ప‌శ్చిమ‌బెంగాల్ మేధావి వర్గం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ప్ర‌స్తుతం బీజేపీ, అధికార టీఎంసీ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బెంగాల్ కోటలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలగా ఉన్న బీజేపీపార్టీ నాయకులను ఆకర్షిస్తూ ముఖ్యమంత్రి మమత బెనర్జీని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, బీజేపీని ఎట్టిపరిస్థితుల్లోనూ బెంగాల్‌లో అధికారానికి దూరంగా ఉంచాలని మమత ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇరు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి.


తాజాగా మమత బెనర్జీపై బీజేపీ నేత, యూపీ పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ఆనంద్ స్వరూప్ శుక్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మమత బెనర్జీఇస్లామిక్ టెర్రరిస్ట్ అంటూ ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం బంగ్లాదేశ్‌లో మమత ఆశ్రయం పొందుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మమత బెనర్జీ బంగ్లాదేశీయురాలని అన్నారు. బంగ్లాదేశ్ టెర్రరిస్టుల మార్గదర్శకత్వంలో బెంగాల్‌లో మమత పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె బంగ్లాదేశ్ లో ఆశ్రయం పొందేందుకు రెడీగా ఉన్నారంటూ విమర్శించారు. మమత బెనర్జీ పూర్తిగా బంగ్లాదేశీయురాలే. ఆమె అక్కడి ఇస్లామిక్ ఉగ్రవాదుల మార్గదర్శకత్వంలో ఇక్కడ పనిచేస్తున్నారు. దేశానికి ఆమె అత్యంత ప్రమాదకారిగా తయారయ్యారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె బంగ్లాదేశ్ ఆశ్రయం పొందేందుకు సిద్ధంగా ఉన్నారు’’ అని రాష్ట్ర మంత్రి కూడా అయిన శుక్లా పేర్కొన్నారు.


మమతపై బీజేపీ అగ్ర నేతలు ఇటీవల వరుసగా విరుచుకుపడుతుండగా, తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి అనంద్ స్వరూప్ శుక్లా మమతపై వివాదాస్పద వ్యాఖ్యలు  చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అంతేకాదు ‘భారత్‌ మాతాకీ జై, వందే మాతరం’ అన్న ముస్లింలకే దేశంలో గౌరవం దక్కుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: