కరోనాపై పోరాటంతోపాటు ఆర్థిక వ్యవస్థ పునరుత్థానం దిశగా భారత్ గణనీయమైన ప్రగతిని సాధిస్తోందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భారతీయ కార్పొరేట్ రంగం మరింత చొరవతీసుకోవాలని సూచనలు చేసారు. కంపెనీ సెక్రటరీలు ఉత్తమ పద్ధతులనుపాటిస్తూ.. కార్పొరేట్ కంపెనీల్లో పారదర్శకతకు పెద్దపీట వేయాలి అని కోరారు. ఇనిస్టిట్యూట్ ఆప్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఈ-స్నాతకోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

కరోనా మహమ్మారి కారణంగా కాస్త వెనక్కు తగ్గినట్లు కనిపించిన భారత ఆర్థిక వ్యవస్థ త్వరలోనే మళ్లీ ప్రగతిబాట పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రగతి పథంలో భారత కార్పొరేట్ రంగం మరింత చొరవ తీసుకోవాల్సిన అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పెను ప్రభావాన్ని చూపించినప్పటికీ.. భారతదేశం సమిష్టిగా ఈ మహమ్మారిని అడ్డుకోవడంలో కొంతమేర విజయం సాధించిందని ఆయన అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా చాలా ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తు చేసారు.

కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా  కేంద్రప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోందన్నారు. కరోనాను ఎదుర్కోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ.. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ శ్రీమతి క్రిస్టాలినా జార్జీవా ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను మరింత ప్రభావవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు భాగస్వామ్య పక్షాలన్నీ ఒకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఐసీఎస్ఐ వంటిసంస్థలు మరింత కృషి చేయాలని ఆయన సూచించారు. ఏ సంస్థ పురోగతైనా.. ఆ సంస్థలో అనుసరించే పద్ధతులపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. ఆయా సంస్థల్లో పారదర్శకత, సమగ్రత, నిజాయితీ వ్యవస్థను నెలకొల్పడంతోపాటు నైతికతకు పెద్దపీట వేయడంలో కంపెనీ సెక్రటరీలు క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆయన పలు సూచనలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: