ఇంటర్నెట్ డెస్క్: ప్రతీ కుక్కకూ ఓ రోజు వస్తుందనే సామెత ఎప్పటినుంచో ఉంది. అంటే తనదైన రోజున కుక్క కూడా శునకం మహా భోగాలు అనుభవిస్తుందని దానర్థం. అయితే భోగాల విషయం ఏమో కానీ ఉత్తరప్రదేశ్ లోని ఘజియబాద్ లో ఉన్న వీధి కుక్కలకు మాత్రం మూడుపూటలా తిండి, చక్కటి వసతి లభిస్తున్నాయి. దీనికి కారణం స్థానికంగా ఉన్న ఓ సొసైటీ సభ్యుల బృందం.

ఘాజియాబాద్‌లో గల రామ్‌ప్రస్థ్ గ్రీన్స్ క్యాంపస్‌లో ఈ దృశ్యం కనిపిస్తుంది. రోడ్లపై తిరిగే కుక్కలకు ఇక్కడ ప్రత్యేకమైన ఆవాసాన్ని రూపొందించారు సొసైటీ సభ్యులు. స్థానికంగా సొసైటీకి 100 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలంలోనే వీధి కుక్కలకు 25 డాగ్ హౌస్‌లను ఏర్పాటు చేశారు. ఇక్కడ వాటికి మూడు పూటలా ఆహారాన్ని అందిస్తూ. చక్కటి వసతి కల్పిస్తున్నారు.

ఈ ప్రాంతంలో వీధి కుక్కల బెడద అధికంగా ఉండడంతో స్థానికులంతా అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ పట్టించుకున్న వారు లేరు. దీంతో రామ్‌ప్రస్థ్ గ్రూప్ సభ్యులు తామంతా తాముగానే వీధి కుక్కల బెడతా వదిలించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే వాటిని దూరంగా వదిలేసేందుకు, లేదా చంపేందుకు వారికి మనసు రాలేదు. ఈ క్రమంలోనే వాటి సంరక్షణకు నడుం బిగించారు.

రామ్‌ప్రస్థ్ గ్రూప్ సభ్యులు చేపట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీధికుక్కల సంరక్షణ బాధ్యతను చేపట్టిన ఈ సంస్థ మొత్తం 70 శునకాల ఆలనాపాలనా చూస్తోంది. సంస్థ తీర్చిదిద్దిన డాగ్ హౌస్‌లలో కుక్కలకు కావాల్సిన ఆహారంతో పాటు లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సొసైటీకి చెందిన ఓ మహిళ ఈ కుక్కలను పర్యవేక్షిస్తుంటారు. సొసైటీలోని సభ్యులు కూడా శునకాల సంరక్షణకు తమవంతుగా సాయం అందిస్తుంటారు.

 ఈ సందర్భంగా రామప్రస్థ్ గ్రూప్ జనరల్ మేనేజర్ భాస్కర్ గాంధీ మాట్లాడుతూ.. కొంతకాలం క్రితం వీధికుక్కల సంరక్షణకు ప్రజలు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని, ఆ పిలుపుతోనే తాము ఈ విధంగా నిర్ణయం తీసుకున్నామని, వీధి శునకాల సంరక్షణ దిశగా నడుంబిగించామని వెల్లడించారు.

ఏది ఏమైనా వీధి కుక్కల కోసం 100 ఎకరాల స్థలాన్ని కేటాయించడం, వాటి ఆలనా పాలనా చూడడం కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం సాధారణ విషయం కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: