ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తొలి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను శనివారం విడుదల చేశారు. నోటిఫికేషన్‌ ప్రకారం.. సోమవారం  ఉదయం 10 గంటలకే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆ వైపుగా ఎలాంటి ఏర్పాట్లు లేవని తెలుస్తోంది.నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేసి రిటర్నింగ్‌ అధికారులను నియమించాల్సిన జిల్లా కలెక్టర్లు.. ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయనట్టుగా తెలుస్తోంది. దీంతో నామినేషన్లు ఎవరూ స్వీకరిస్తారు.. ఎక్కడ స్వీకరిస్తారు అన్నది తేలడం లేదు.

        ఇప్పటికీ జిల్లాల్లో ఎన్నికల నోటిఫికేషన్లు జారీ చేయలేదు కలెక్టర్లు.ఎస్‌ఈసీ ఆదేశాలను పక్కనపెట్టి  ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీన నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా ఎన్నికలు జరుగుతాయా లేదా అనుమానాలే వ్యక్తమవుతున్నాయి.మరోవైపు నామినేషన్ల దాఖలుకు తాము సిద్ధంగా ఉన్నామంటున్నాయి ప్రతిపక్షాలు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పై  సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ వేసిన పిటిషన్ సోమవారం మధ్యాహ్నం బెంచ్‌ ముందుకు వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో.. సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఎన్నికల విషయంలో ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య మొదటి నుంచి వివాదమే నడుస్తోంది. గత మార్చిలో ఎన్నికలకు జగన్ సర్కార్ నిర్ణయించగా.. కరోనా కారణంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారు. అప్పుడు ఎస్ఈసీ నిర్ణయంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ షెడ్యూల్ ఇవ్వగా.. సర్కార్ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఎన్నికల నిర్వహణకు సహకరించేది లేదని చెబుతోంది. దీంతో వివాదం కోర్టులకు వెళ్లింది. ఎస్ఈసీ ఇచ్చిన షెడ్యూల్ హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేయగా.. హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లింది ఏపీ సర్కార్.

 


మరింత సమాచారం తెలుసుకోండి: