దుర్గ గుడిలో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో విపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా ఈ అంశం హాట్ టాపిక్ అయింది. ఇక తాజాగా ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం కూడా సంచలనం అయింది అనే చెప్పాలి. ఇక తాజాగా జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. దుర్గగుడి లో ఏసీబీ దాడులు పై   మంత్రి వెల్లంపల్లి, ఈ. ఓ సురేష్ బాబు పై ఘాటుగా వ్యాఖ్యలు చేసారు ఆయన.

అసలైన వారిని వదిలివేసి చిరు ఉద్యోగులను బలిచేయటం సరికాదు అని ఆయన మండిపడ్డారు. ఈ.ఓ సురేష్‌బాబు ఆధ్వర్యంలో అవినీతి జరుగుతుంది అని విమర్శించారు. అవినీతికి పాల్పడ్డ వారు కూడా మంత్రి బినామీలే అని విమర్శలు చేసారు. స్వరూపానంద స్వామి, మంత్రి వెల్లంపల్లి, సజ్జల రామకృష్ణారెడ్డిలకు ఈ.ఓ సురేష్‌ బాబు ముడుపులు చెల్లించారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. వారి ఆశీస్సులు వల్లే సస్పెండ్‌ వేటు నుంచి ఈఓ, భర్తరఫ్‌ నుంచి మంత్రి తప్పించుకున్నారు అని మండిపడ్డారు.

ప్యాకేజీలు, ముడుపులు అందకపోతే తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఏసీబీ రైడింగ్స్‌ జరిపిస్తారు అని విమర్శలు చేసారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానిది అవినీతిరహిత ప్రభుత్వం అయితే ఇలాంటివి జరుగుతాయా? అని ప్రశ్నించారు. అమ్మతో ఆటలాడుకుంటున్న జగన్మోహన్‌రెడ్డికి, వెల్లంపల్లికి, సురేష్‌బాబుకి అమ్మే తగిన గుణపాఠం చెబుతుంది అని ఆయన హెచ్చరించారు. దుర్గగుడిలో వివిధ విభాగాల్లో అవినీతికి పాల్పడిన మంత్రి పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని నిలదీశారు. ఈఓ సురేష్‌బాబును వదిలేసి మిగిలిన చిరు ఉద్యోగులను బలిచేయటం సరికాదు అని అన్నారు. ఈఓకి, మంత్రికి పై స్ధాయిలో లాబీయింగ్‌ ఉన్న కారణంగానే వారిని వదిలేశారా? అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: