కేసీఆర్ తనయుడు కేటీఆర్ రేపు మాపో ముఖ్యమంత్రి అవుతారని అందరూ అనుకున్నారు. అయితే అది కాస్తా వెనక్కి వెళ్లిపోయింది. అసలు ఈ దఫా కేసీఆర్ తన కొడుకు కేటీఆర్ ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారా లేదా అనేది కూడా అనుమానమే. అదే సమయంలో తన మంత్రిత్వ శాఖ పరంగా మంచి పేరు తెచ్చుకుంటున్న కేటీఆర్, ఎన్నికల విషయంలో మాత్రం పరాభవాలు ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ విషయంలో అన్నీ తానే పార్టీని ముందుకు నడిపించి, సెంచరీ కొడతామంటూ డైలాగులు కొట్టిన కేటీఆర్ చివరకు బీజేపీకి తలవంచాల్సిన పరిస్థితి. మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు మావేకదా అని సర్ది చెప్పుకుంటున్నా, గ్రేటర్ లో టీఆర్ఎస్ పట్టు తప్పిందనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. అదే సమయంలో ఇప్పుడు పట్టభద్రుల స్థానానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి గెలుపు కూడా కేటీఆర్ కి ప్రతిష్టాత్మకంగా మారింది. ఆమె గెలుపుకోసం కేటీఆర్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఈ దఫా అయినా వాణీదేవిని గెలిపించి, పట్టభద్రుల స్థానంలో గతంలో టీఆర్ఎస్ కి ఉన్న ప్రతికూల చరిత్రను తిరగరాస్తామంటున్నారు కేటీఆర్.

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానం టీఆర్ఎస్ కి మొదటి నుంచీ కొరకరాని కొయ్యగా ఉంది. వరుస ఓటములతో ఆ స్థానంపై ఆశలే వదిలేసుకుంది టీఆర్ఎస్. ఈ దఫా కూడా సిట్టింగ్ ఎమ్మెల్సీ నాగేశ్వర్ కి అవకాశాన్ని వదిలేసి, హుందాగా పోటీనుంచి తప్పుకుంటారనుకున్నన టైమ్ లో కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవిని అభ్యర్థిగా తెరపైకి తెచ్చి ప్రత్యర్థులకు షాకిచ్చారు. అయితే వామపక్షాల సపోర్ట్ ఉన్న నాగేశ్వర్ ని ఢీకొట్టడం అంత ఈజీ కాదనేది కేసీఆర్ కి కూడా తెలుసు. అయినా సరే అభ్యర్థిని నిలబెట్టి పోటీలో ఉన్నామనిపించుకున్నారు టీఆర్ఎస్ నేతలు.

ఇప్పుడా గెలుపు భారం కేటీఆర్ పై పడింది. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబం ధించి 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎన్నికలో అనుసరించాల్సిన ప్రచార వ్యూహం, ప్రణాళిక, ప్రచార షెడ్యూల్‌కు సంబంధించి కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. 43 అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రాల్లో ఈ నెల 27న టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. పట్టభద్రుల కోటా ఎన్నిక లేని మెదక్, కరీం నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలను ఇన్‌ చార్జీలుగా నియమిస్తామని చెప్పారు. ఈ నెల 27 తర్వాత పార్టీ ఇన్‌ చార్జీల పర్యవేక్షణలో మండల స్థాయిలో పట్టభద్ర ఓటర్లతో ప్రచార సభలు నిర్వహించాలని ఆదేశించారు. మొత్తమ్మీద గెలుపు భారమంతా తనపైనే వేసుకుని కేటీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే గెలుపు అంత సులభం కాదని తేలడంతో.. మరోసారి కేటీఆర్ కి పరాభవం తప్పదని అంటున్నారు కొంతమంది. ఒకవేళ నిజంగానే పట్టభద్రుల స్థానంలో టీఆర్ఎస్ జెండా ఎగిరితే మాత్రం ఆ పార్టీ పనైపోతుంది అనుకుంటున్న వారికి ఇదో గట్టి జవాబుగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: