భోపాల్: జాతిపిత మహాత్మాగాంధీని చంపిన గాడ్సేపై కాంగ్రెస్ మొదటి నుంచీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంటుంది. గాడ్సేను దేశ ద్రోహిగా పేర్కొంటూ అతడిని తీవ్రంగా నిందిస్తుంది. గాడ్సేకు మద్దతునిచ్చేవారిపై కాంగ్రెస్ నిప్పులు చెరుగుతూ ఉంటుంది. అలాంటిది గురువారం ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. మొదటి నుంచి గాడ్సేకు మద్దతుగా ఉండే వ్యక్తిని తమ పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.  గాంధీ పార్టీగా పేరున్న కాంగ్రెస్‌లో గాడ్సే సానుభూతిపుడు చేరడం ఇప్పుడు సంచలనంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని అఖిల భారతీయ హిందూ మహాసభకు అధ్యక్షుడైన బాబులాల్ చౌరాసియా అనే వ్యక్తి గురువారం మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. హిందూ మహాసభపై, గాడ్సేపై కాంగ్రెస్ ఎప్పుడూ ఆగ్రహంతోనే ఉంటుంది. అలాంటిది బాబులాల్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి మరీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లో బాబూలాల్ చేరగానే అనేక విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో బాబూలాల్ పాల్గొన్న అనేక కార్యక్రమాలను గుర్తు చేస్తూ అనేకమంది అభ్యంతరాలు వ్యక్తం చేయడం ప్రారంభించారు.  ఈ క్రమంలోనే 2017 నవంబర్ 15న గాడ్సే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడంపై బాబూలాల్ వివరణ ఇచ్చారు. నిజానికి తాను బలవంతంగా ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి వచ్చిందని, తనపై జరిగిన కుట్ర వల్ల తాను అక్కడ ఉండాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అయితే ఆ సమావేశంలో గాడ్సే నుంచి తాను ఎంతో నేర్చుకున్నాని బాబూలాల్ పేర్కొన్నారు. 2018 డిసెంబర్ 11న జరిగిన మరో కార్యక్రమంలో కూడా బాబూలాల్ పాల్గొన్నారు.

‘హిందూ మహాసభ నాపై కుట్ర పన్ని నన్ను ఆ కార్యక్రమంలో ఉండేలా చేసింది. గాడ్సే విగ్రహంపై నీళ్లు పోసి నివాళి అర్పించమని కొందరు నాతో సైగ చేశారు. కానీ మాజీ కాంగ్రెస్ నేతనైన నేను గాడ్సేకు ఎలా మద్దతుగా ఉండగలను? అందుకే అక్కడే వారికి కుదరదని తేల్చి చెప్పాను’ అని బాబూలాల్ చెప్పుకొచ్చారు. అయితే బాబూలాల్ సమాధానాలతో ఇప్పటికీ కాంగ్రెస్‌లో అనేకమంది సంతృప్తి చెందినట్లు లేదు. ఇంకా కొంతమంది ఆయన చేరికను వ్యతిరేకిస్తుండడమే దీనికి కారణం. మరి కమల్ నాథ్ దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: