మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసి కేవలం ఉపసంహరణానికే సమయం మిగిలుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది అభ్యర్థులు నామినేషన్లు వేసిన తర్వాత ఈ ఏడాది గ్యాప్ లో రకరకాల కారణాలతో చనిపోయారు. వారి స్థానంలో కొత్తగా నామినేషన్లు స్వీకరిస్తున్నారు అధికారులు. ఈ ఒక్కరోజు మాత్రమే జరిగే ఈ కార్యక్రమం హడావిడిగా మొదలైంది. అయితే చనిపోయినవారు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయితే, అదే పార్టీనుంచి మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారు.

పుర ఎన్నికల్లో నామినేషన్లు దాఖలుచేసి మరణించిన 59 మంది స్థానంలో అదే పార్టీకి చెందినవారి నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు తీసుకొని మార్చి 1న వాటిని పరిశీలిస్తారు. తిరిగి 3వతేదీ నామినేషన్లు ఉపసంహరించుకోడానికి అవకాశం ఉంది. అదేరోజు మిగిలిన ఉపసంహరణలు కూడా ఉంటాయి. మార్చి3 వతేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలు ప్రచురిస్తారు. గత మార్చిలో నామినేషన్లు వేసిన వారిలో 9 నగరపాలక సంస్థల్లో, 35 పురపాలక, నగర పంచాయతీల్లో కలిపి 59 మంది మృతిచెందారు. ఏ పార్టీవారు చనిపోయారో అదే పార్టీ తరఫున మరొకరు బీఫారంతో నామినేషన్‌ వేసే వెసులుబాటు కల్పిస్తూ ఎన్నికల సంఘం ఇటీవల నిర్ణయం తీసుకుంది.

నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో మరోసారి సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే నామినేషన్లు వేసినవారు ప్రచారంలో మునిగిపోగా.. కొత్తగా నామినేషన్లు వేస్తున్నవారు బీఫారంలు తీసుకుని సందడి చేస్తున్నారు. అనుకోకుండా కలసి వచ్చిన అదృష్టాన్ని ఎలాగైనా గెలుపు వరకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. కొన్నిచోట్ల అనివార్యంగా వచ్చిన ఈ నామినేషన్లు పార్టీల్లో గొడవలు పెట్టాయి. బీఫారంల కోసం గొడవలు కూడా మొదలయ్యాయి. అయితే వాటిని సద్దుమణిగేలా చేసి చివరకు ఒకరిని అభ్యర్థిగా బరిలో దింపుతున్నారు. మొత్తమ్మీద ఉపసంహరణల కార్యక్రమం ముగిస్తేనే ఎవరు అధికారిక అభ్యర్థి, ఎవరు డమ్మీ అభ్యర్థి అనే విషయం తేలిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: