ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ముగిశాక రాహుల్‌గాంధీని తెలంగాణ‌లో ప‌ర్య‌టించేలా చేసేందుకు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి య‌త్నాలు ఆరంభించారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ముగిశాక దాదాపుగా రాహుల్‌గాంధీ ప‌ర్య‌ట‌న ఉండే అవ‌కాశాలున్న‌ట్లుగా తెలుస్తోంది. అంతిమంగా నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌కు కూడా ఇది ప‌నిచేస్తుంద‌ని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. రాహుల్ ప‌ర్య‌ట‌నను విజ‌యవంతం చేయ‌డం ద్వారా త‌న ప‌ట్టును కూడా పార్టీ నేత‌ల‌కు చాటిన‌ట్ల‌వుతుంద‌నే వ్యూహంతో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. బ‌హిరంగ స‌భ‌ను ఎక్క‌డ ఎలా నిర్వ‌హిస్తే బాగుటుంద‌న్న కోణాల్లో రేవంత్ ఆలోచిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో రైతాంగ సమస్యలతో ముందుకెళ్తే జనబలం సంపాదించగలమని కాంగ్రెస్ అధిష్ఠానం బలంగా భావిస్తున్న విష‌యం తెలిసిందే.


ఈ వ్యూహంతోనే రేవంత్‌రెడ్డి చేపట్టిన రాజీవ్ భరోసా పాదయాత్రకు మంచి స్పందన వ‌చ్చింది.  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నూతన సాగు చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ తీసుకున్న నేపథ్యంలో రైతులకు జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ జనంలోకి వెళ్తే మంచి ఆదరణ లభిస్తుందన్న ఉద్దేశంతో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఈమేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ రైతుల పక్షాన పోరాడుతోందని ఘనంగా చాటేందుకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పోరాటానికి ప్రజలకు,పార్టీ కార్యకర్తలకు పిలుపునివ్వాలనే ప్లాన్‌తో ఉందని తెలుస్తోంది. ఈ మేరకు రేవంత్‌రెడ్డి వెళ్లి ఢిల్లీ పెద్దలను ఒప్పించినట్లుగా కూడా పార్టీలో చర్చ జరుగుతోంది.


టికాయత్‌తో అందుకే భేటీ అయ్యారని, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నామని, తప్పకుండా మీరు రావాలని ఆయన్ను కోరిన విషయం తెలిసిందే. మార్చి మొదటివారంలో ఆయన రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకరించారని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలోని ఘాజీపూర్‌ సరిహద్దుల్లో కొద్దిరోజుల క్రితం ఆయన తికాయత్‌ను కలిశారు. 'కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మార్చి మొదటి వారంలో రైతు సంఘాలు రాష్ట్రంలో బహిరంగ సభ ర్వహించనున్నాయి. ఆ సభకు హాజరయ్యేందుకు తికాయత్‌ అంగీకరించారు' అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: