ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డికి తిరుగులేదనే సంగతి తెలిసిందే. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్, అద్భుతమైన పాలనతో దూసుకుపోతున్నారు. దాదాపు 50 శాతం పైనే ప్రజలు జగన్‌కు మద్ధతు తెలుపుతున్నారని, ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు రుజువు చేశాయి.
అయితే ఏపీలో తిరుగులేని ఆధిక్యంలో ఉన్న జగన్ కేంద్రాన్ని శాసించలేకపోతున్నారనే సంగతి తెలిసిందే. కేంద్రంలో బీజేపీ మంచి మెజారిటీతో అధికారంలో ఉంది. దీంతో జగన్, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి పెట్టలేకపోతున్నారు. ముఖ్యంగా విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేక హోదా లాంటి అంశాల విషయంలో జగన్ కేంద్రంతో పోరాడలేకపోతున్నారు.
అసలు ఈ విషయంపై జగనే ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీకి మంచి మెజారిటీ ఉండటం వల్ల కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి పెట్టలేమని చెప్పేశారు. ఇక వైసీపీకి 22 మంది ఎంపీలు(గతంలో తిరుపతి ఎంపీని కలుపుకుని), ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నా సరే పెద్దగా ఉపయోగం లేదని ప్రతిపక్ష టీడీపీ అనేక సందర్భాల్లో విమర్శలు చేస్తూ వచ్చింది. పైగా ఈ రెండు సంవత్సరాల కాలంలో వైసీపీ ఎంపీలు రాష్ట్రం కోసం పొరాడి కేంద్రం నుంచి తీసుకొచ్చింది ఏమి లేదు. పోనీ రాష్ట్రం కోసం గట్టిగా మాట్లాడిన సందర్భాలు కూడా లేవు.
అయితే టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీలు లోక్‌సభలో రాష్ట్రం కోసం గట్టిగానే పోరాడుతున్నారు. తమదైన శైలిలో గళం విప్పుతూ ముందుకెళుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే వైసీపీ ఎంపీలు కంటే టీడీపీ ముగ్గురు ఎంపీలు కేంద్రంపై బాగానే పోరాడుతున్నారనే విషయం కనబడుతోంది. ఇక ఇదే స్ట్రాటజీని ఉపయోగించి తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో వైసీపీకి చెక్ పెట్టాలని టీడీపీ చూస్తోంది.
ఇప్పటికే వైసీపీకి 21 మంది ఎంపీలున్నారని, వారు రాష్ట్రం కోసం చేసింది ఏమి లేదని, కానీ టీడీపీ నేతలు రాష్ట్రం కోసం గట్టిగా పోరాడుతున్నారని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి జగన్‌కు ఇంకో ఎంపీ ఇచ్చిన ఉపయోగం లేదని, అదే టీడీపీని గెలిపిస్తే రాష్ట్రం కోసం పోరాడే వాళ్ళలో మరోక ఎంపీ చేరతారని అంటున్నారు. మరి చూడాలి టీడీపీ స్ట్రాటజీ ఏ మేర వర్కౌట్ అవుతుందో.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి