కోళ్ల పందాలు వినే ఉంటాము... కానీ ఈ అందాల పోటీలు ఏంటి.. అనే ప్రశ్నలు అందరికీ కలుగుతాయి.. అవును మీరు విన్నది నిజమే .. కోళ్లకు కూడా అందాల పోటీలు ఉన్నాయి. ఆ పోటీలో పాల్గొనేది మాత్రం వేరే రకం జాతి కోళ్లు.. ప ర్లా జాతి కోడి పెట్టలూ, పుంజులూ ఊళ్లలో మనం చూసే కోళ్ల కన్నా ప్రత్యేకంగా ఉంటాయి. చిలక ముక్కులాంటి ముక్కు, నెమలి పింఛంలాంటి తోక, పొడవైన శరీరం, చూడముచ్చటైన రూపంతో రకరకాల రంగుల్లో ఉంటాయి.అందచందాలే వీటి ధరను నిర్ణయించేస్తుంటాయి. అందాల పోటీల్లో విజేతగా నిలబెట్టేస్తుంటాయట..


వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, గుంటూరు, విజయనగరం, అనంతపురం జిల్లాల్లో చాలామంది ఈ కోళ్లను పెంచుతున్నారు. ప్రకాశం జిల్లాలోని కంభంలో కృష్ణమాచారి ఈ కోళ్లను ప్రత్యేకంగా పెంచుతున్నారు. 'ఏటా జరిగే అందాల పోటీల్లో నా దగ్గరున్న కోళ్లు బహుమతులు తెచ్చిపెడుతున్నాయి' అంటూ ఆనందంగా చెబుతారాయన. అందాల కోడిగా పేరున్న ఈ పర్లా కోళ్ల పెంపకానికి చాలా ప్రత్యేక పద్ధతులే ఉంటాయి. కోడి అందమైన ఆకృతి కోసం ప్రత్యేకమైన డైట్‌ ప్లాన్‌ ఉంటుందట.. ఇక ఈ కోడి గుడ్డు కూడా 1000 కి పైగా పలుకుతుందట..

అంతా బాగానే ఉంది కానీ ఈ అందాల పోటీలు ఎక్కడ జరుగుతాయనే సందేహాలు వస్తున్నాయి.. అయితే, తమిళనాడు రాష్ట్రంలోని దిండుక్కల్‌, సేలం, మదురై, తిరుచ్చి, చెన్నై లాంటి చోట్ల. ప్రత్యేకమైన కోళ్ల జాతుల్ని పెంచే కొందరు పెంపకందారులు 'ఆలిండియా అస్లీస్‌' అనే క్లబ్‌ని ఏర్పాటు చేసుకున్నారు. దీని ఆధ్వర్యంలో 2014 నుంచి ఈ అందాల పోటీల్ని జరుపు తున్నారు. ఏటా జరిగే ఈ పోటీల్లో పాల్గొనడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. 'అందాల తోక నాదేనూ... మెరిసేటి రంగు నాదేనూ' అంటూ ఇంచుమించు రెండు వేల కోళ్లు ఈ పోటీలో పాల్గొంటాయి. అందాలపోటీల్లానే ఇక్కడా న్యాయనిర్ణేత లుంటారు. కోడి ముఖకవళికలు, కళ్లు, ముక్కు, మెడ, రెక్కలు, కాళ్లు, తోక, నిలబడే విధానం, ఒడ్డూ పొడుగూ.. అన్నీ చూసి మార్కులు వేస్తారు. వచ్చిన వందలాది కోళ్లలో మొదటి బహుమతికి పదికోళ్లను, రెండో బహుమతికి 30 కోళ్లను ఎంపిక చేసి వారికి తగిన బహుమతులు ఇస్తారట.. వాటికి మామూలు డిమాండ్ లేదని చెప్పాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: