ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి వెళుతున్న అంబులెన్స్ ల‌ను తెలంగాణ స‌రిహ‌ద్దుల్లో ఆపేయ‌డం ఎంత‌వ‌ర‌కు మాన‌వ‌త్వ‌మ‌ని తెలంగాణ హైకోర్టు అక్క‌డి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. రోగి ప‌రిస్థితి బాగోలేన‌ప్పుడు.. వైద్యం అత్య‌వ‌స‌రంగా అందించాల్సి వ‌చ్చిన‌ప్పుడే అంబులెన్స్ వాడ‌తామ‌నేది అంద‌రికీ తెలిసిందే. అంత‌టి అత్య‌యిక స్థితిలో రోగిని తీసుకువెళుతున్న అంబులెన్స్ ల‌ను ఆపేయించాల్సిన క‌ర్మ ఎందుకొచ్చింది? వాటిని ఎందుకు వెన‌క్కి తిప్పి పంపుతున్నారు? అనేది ఒక‌సారి ఎవ‌రికివారు విశ్లేషించుకోవాల్సిన సంద‌ర్భం ఇది.

అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ లేక‌పోవ‌డమే కార‌ణం!
ఎన్టీఆర్ నుంచి చంద్ర‌బాబునాయుడు, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌ర‌కు అంద‌రూ ఏపీలో ఉన్న ఫార్మా కంపెనీలు, ఆసుప‌త్రుల‌ను  హైద‌రాబాద్ వ‌చ్చేయ‌మ‌న్నారు. దీంతో అంద‌రూ అప్ప‌టి రాజ‌ధానికి వెళ్లిపోయారు. ఒక‌ప్పుడు ఏపీలోని విజ‌య‌వాడ ఫార్మా కంపెనీల‌ హ‌బ్‌గా ఉండేది. త‌ర్వాత అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ జ‌ర‌గ‌కుండా ఒక్క హైద‌రాబాద్‌లోనే కేంద్రీకృత‌మ‌వ‌డం ఇప్ప‌టి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు విషాదంగా ప‌రిణ‌మించింది. ఏపీలోని 13 జిల్లాల్లో చెప్పుకోద‌గ్గ‌స్థాయి ఆసుప‌త్రి ఒక్క‌టి కూడా లేదు. కోస్తా జిల్లాల‌వారు హైద‌రాబాద్‌కు, రాయ‌ల‌సీమ ప్ర‌జ‌లు చెన్నైకానీ, బెంగ‌ళూరుకానీ వెళుతున్నారు. ఉత్త‌రాంధ్రులు ఒడిసా వెళుతున్నారు. మ‌రి జ‌రిగిన అభివృద్ధి మొత్తం ఏమైపోయిన‌ట్లు? అనే ప్ర‌శ్న‌కు ఎవ‌రిద‌గ్గ‌రా స‌మాధానం లేదు.

పేదరికం దిశ‌గా ఏపీ?
ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న‌ప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లంతా మంచి ఆదాయ‌వ‌న‌రులు ఉన్న‌వారు.. తెలంగాణ ప్ర‌జ‌లు పేద‌వారు.. అక్క‌డివారొచ్చి ఇక్క‌డివారిని దోచుకుంటున్నార‌నే రాజ‌కీయ నేత‌ల త‌ప్పుడు ప్ర‌చారంవ‌ల్ల ఇప్ప‌టికీ ఆ భావ‌న అలాగే ఉండిపోయింది. రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత తెలంగాణ ధ‌నిక రాష్ట్రంగా అవ‌త‌రించ‌గా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేద‌రాష్ట్రంగా మిగిలింది. రాజ‌కీయ నేత‌ల ఆస్తుల‌న్నీ హైద‌రాబాద్‌లోనే ఉన్నాయి. ఇక్క‌డి ప్ర‌జ‌లు ఉద్యోగాల కోసం ఇప్ప‌టికీ తెలంగాణ‌కు వెళుతూనే ఉన్నారు. ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌లు స‌హృద్భావంతోనే ఉన్నారు. రాజ‌కీయ నేత‌ల మ‌న‌సుల్లోనే విష‌బీజాలున్నాయ‌ని స‌రిహ‌ద్దుల‌వ‌ద్ద అంబులెన్స్ లు ఆపిన‌ప్పుడు అర్థ‌మ‌వుతోందంటూ రాజ‌కీయ విశ్లేష‌కులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న నేత‌లు ఇప్ప‌టికైనా స‌రిహ‌ద్దుల్లో అంబులెన్స్ లు ఆపిన సంఘ‌ట‌న‌ను ఒక గుణ‌పాఠంగా తీసుకోవాల‌ని, అభివృద్ధిని వికేంద్రీక‌రించాల‌ని, అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చేయ‌డంవ‌ల్ల భ‌విష్య‌త్తులో ఇటువంటి ప‌రిస్థితి త‌లెత్త‌కుండా చూసుకోవాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.







మరింత సమాచారం తెలుసుకోండి: