ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల టైమ్ ఉంది. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఇప్పటినుంచే ముందు జాగ్రత్త పడుతున్నాయి. ముఖ్యంగా జనసేన-బీజేపీ.. వచ్చే దఫా అధికారం చేజిక్కించుకోవాలని, లేకపోతే కనీసం ప్రధాన ప్రతిపక్ష పాత్ర అయినా పోషించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కూడా అసెంబ్లీలోకి ఎంట్రీ ఇవ్వడానికి కసరత్తులు మొదలు పెట్టారని సమాచారం. గతంలో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ ఈసారి బలమైన నియోజకవర్గంకోసం వేట మొదలు పెట్టారట.

2019 సార్వత్రిక ఎన్నికలలో పవన్ కల్యాణ్ రాయలసీమ నుంచి పోటీ చేస్తారని ఊహించారంతా. కానీ ఆయన సామాజిక సమీకరణాల లెక్కతో గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారు. కనీసం తమ సామాజిక వర్గం ఓట్లయినా గుంపగుత్తగా పడతాయని, గెలుపు నల్లేరుమీద నడకేనని, రెండుచోట్లా గెలిస్తే ఏ నియోజకవర్గం వదిలేయాలా అనే ఆలోచనలో ఉండిపోయారు. కానీ సీన్ రివర్స్ అయింది, పవన్ రెండుచోట్లా ఓడిపోయారు.

ఈసారి ఒక్కచోటే..?
ఈసారి పవన్ కల్యాణ్ ఒకే ఒక్క నియోజవకవర్గంలో పోటీ చేస్తారని తెలుస్తోంది. రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోవడం కంటే.. ఒకేచోట నిలకడగా ప్రచారం చేసి కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు పవన్ కల్యాణ్.

తిరుపతి సేఫేనా..?
తిరుపతిపై పవన్ కల్యాణ్ కు ఎప్పటినుంచో గురి ఉంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున అక్కడ చిరంజీవి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సెంటిమెంట్ తోపాటు, తిరుపతిలో రాజకీయ సమీకరణాలు తనకు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు పవన్. ఇటీవల తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించిన పవన్ జనసేనకు మంచి పాపులార్టీ ఉందని నిర్థారణకు వచ్చారు. అందుకే తిరుపతి బైపోల్ లో జనసేన అభ్యర్థిని బరిలో దింపాలని చివరి వరకూ పోరాడారు. ఇప్పుడు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంపై పవన్ దృష్టిసారించినట్టు తెలుస్తోంది.

ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉన్నా కూడా.. పవన్ ఇప్పటినుంచే నియోజకవర్గంపై కాన్సన్ ట్రేషన్ చేశారట. చేతిలో ఉన్న సినిమాలను చకచకా కంప్లీట్ చేసి తాను పోటీ చేయాలనుకుంటున్న నియోజకవర్గంలో మకాం వేయాలనుకుంటున్నారట. పోయినసారి జరిగిన తప్పుల్ని ఈసారి రిపీట్ చేయకుండా ఉండాలనుకుంటున్నారట పవన్. గత ఎన్నికల్లో బీఎస్పీ, పలు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్న జనసేన, ఈసారి కేవలం బీజేపీనే నమ్ముకుంది. బీజేపీ స్నేహం జనసేనకు ఎంతవరకు కలిసొస్తుందో తేలాలంటే 2024వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: