దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు భరించలేనంతగా రోజు రోజుకీ పెట్రోలు ధరల్ని సవరిస్తూ పోతున్నాయి కంపెనీలు. అంతర్జాతీయంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయా అని ఆరా తీస్తే.. మరీ ఈ స్థాయిలో లేదనే విషయం స్పష్టమవుతోంది. మరి కేంద్రం ఉద్దేశం ఏంటి? ఎందుకిలా రేట్లు పెంచుకుంటూ పోతోంది.

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ వింటే సామాన్య ప్రజల ఒళ్లుమండుతుంది. కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయి, ఉద్యోగాలు పోయి, పనులు లేక ప్రజలు అల్లాడిపోతుంటే వారిపై పెట్రోభారం మోపిన ప్రభుత్వం తమ విధానాల్ని సమర్థించుకోడానికి తాపత్రయపడుతోంది. కరోనా వ్యాక్సిన్ కోసం 35వేల కోట్ల రూపాయలు కేటాయించామని, దేశవ్యాప్తంగా ఉచిత రేషన్ పథకం కోసం లక్షకోట్లు కేటాయించామని, ఆ సొమ్మంతా ఎక్కడినుంచి రావాలని ప్రశ్నిస్తున్నారు ధర్మేంద్ర ప్రధాన్.

వాస్తవానికి గతంలో అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలు రేట్లు భారీగా పడిపోయిన సందర్భంలో.. భారత్ లో మాత్రం ఆ లాభాలను కేంద్రం తన జేబులో వేసుకుంది. వినియోగదారులకు బదలాయించలేదు. ఇప్పుడు పెట్రోలు రేట్లను విపరీతంగా పెంచి ట్యాక్స్ ల రూపంలో వసూళ్లు మొదలు పెట్టింది. విచిత్రం ఏంటంటే.. ఇటీవల 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు పూర్తయిన తర్వాతే ఈ స్థాయిలో రేట్లు పెంచడం గమనించాం. ఎన్నికలైపోయిన తర్వాత ఇప్పటి వరకు 23సార్లు కేంద్రం పెట్రోలు రేట్లు పెంచింది. అంటే.. ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు రావాలి, అవి పూర్తయ్యాక రేట్లు పెంచి జనం జేబులకి చిల్లులు పెట్టాలి. ఇదీ కేంద్రం వాదన.

పెట్రోలు, డీజిల్ రేట్ల పెంపు నేరుగా వాహనదారులపైనే కాదు, పరోక్షంగా దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల రేట్ల పెరుగుదలకు కూడా కారణం అవుతోంది. బియ్యం ఉచితంగా ఇచ్చి, నిత్యాసరాల ధరలు పెంచేస్తే ఎవరికి ఉపయోగం? వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చి, కుటుంబాన్ని వీధిన పడేలా చేస్తే ఏంటి లాభం? వ్యాక్సిన్, ఇతర పథకాల పేర్లు చెప్పి కేంద్రం పెట్రోలు రేట్లను భారీగా పెంచడంతో సహజంగానే వ్యతిరేకత పెరుగుతోంది. ఈ వ్యతిరేకత వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడుతుందో లేదో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: