రఘురామకృష్ణంరాజు నరసాపురం ఎంపీ అని ఏపీలో ప్రతి ఒక్కరికీ తెలుసు. మామూలుగా వైసీపీలో ఉండుంటే ఈయన ఎంపీ అని నరసాపురం ప్రజల వరకు తెలిసేది గానీ, రాష్ట్ర స్థాయిలో హైలైట్ అయ్యేవారు కాదు. కానీ వైసీపీ తరుపున గెలిచి అదే పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పడం వల్ల రాజుగారు బాగా హైలైట్ అయ్యారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కంటే ఎక్కువగా రాజుగారు, వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్నారు.


అటు వైసీపీ కూడా రాజుగారికి చెక్ పెట్టడానికి గట్టిగానే ప్రయత్నిస్తుంది గానీ, అవి పెద్దగా వర్కౌట్ కావడం లేదు. రాజుగారు మరింతగా రెచ్చిపోయి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అలాగే ఇటీవల వరుసపెట్టి జగన్‌కు లేఖలు రాస్తున్నారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయడం లేదని జగన్‌ని ప్రశ్నిస్తున్నారు. పలు అంశాల్లో జగన్ మాట తప్పారని లేఖలు రాస్తున్నారు.


ఇదే సమయంలో ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు. జగన్ ప్రభుత్వం అర్హతకు మించి అప్పులు చేస్తుందని, ఉచిత పథకాలకు వేల కోట్లు రుణాలు తెచ్చేందుకు చూస్తుందని, విశాఖలో భూములని తాకట్టు పెట్టడానికి ప్రయత్నిస్తుందని లేఖ రాసేశారు. వీటికి అడ్డుకట్ట వేసి, ప్రజల ఆస్తులని కాపాడాలని మోదీని కోరారు. అయితే ఏపీ ప్రజల కోసం జగన్‌పై పోరాటం చేస్తున్న రఘురామ అదే జనం కోసం మోదీ ప్రభుత్వంపై ఎందుకు పోరాటం చేయడం లేదని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఒక ఎంపీగా ఉండి రఘురామ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి పోరాటం చేశారో చెప్పాలని అడుగుతున్నారు.


కేంద్రం హోదా విషయంలో చేతులెత్తేసింది. ప్రత్యేక ప్యాకేజ్‌ని అమలు చేయలేదు. విభజన హామీలని గాలికొదిలేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి చూస్తుంది. రైల్వే జోన్ ఊసు లేదు. కడప స్టీల్ ప్లాంట్ ఏమైందో తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాల్లో రాష్ట్రాన్ని, కేంద్రం పట్టించుకోవడం లేదు. మరి అలాంటి అంశాలపై రఘురామ, మోదీకి లేఖ ఎందుకు రాయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. అసలు ఎంపీగా ఉండే ఈ రెండేళ్లలో రాష్ట్రం కోసం ఏ సాధించారో చెప్పాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: