మహరాష్ట్ర రాజధాని ముంబైపై ప్రకృతి పగబట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో ముంబైపై వరుణుడు ప్రతాపం చూపాడు. ఈ ఒక్క జులైలోనే ఏకంగా 200సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఇటీవలే భారీ వర్షాలతో అతలాకుతలమైన ముంబై.. మళ్లీ అదే స్థితికి చేరుకుంది. ఏకధాటిగా కురుస్తోన్న భారీ వర్షాల దెబ్బకు మళ్లీ నీట మునిగింది. కొన్ని గంటల పాటు కురిసిన కుండపోతతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబైకర్లు నిద్రలేని రాత్రిని గడిపారు. లోతట్టు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. వీధుల్లో పార్క్ చేసి ఉంచిన వాహనాలు కొట్టుకుపోయాయి.


ముంబైని వానలు ముంచెత్తుతుండంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు ఇబ్బంది తలెత్తుతోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ముంబై, థానె, పాల్ఘర్‌కు భారత వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేసింది. ఇక ఇవాళ  కూడా వానలు తగ్గే సూచనలు కనిపించడం లేదని అంచనా వేసింది. పరిస్థితి ఇలానే కొనసాగే అవకాశం ఉందని.. మరో 24గంటల పాటు వాన వరుణుడు శాంతించే  ఛాన్స్‌ లేదని తెలిపింది. ఇక ఏదైనా అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని బీఎంసీ నగరవాసులకు సూచించింది.


భారీ వర్షాల ధాటికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటితో నిండిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు పోటెత్తింది. చెంబూర్‌లో భారీ వ‌ర్షాల‌కు రోడ్లన్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ప‌లుచోట్ల రోడ్లపై భారీగా వ‌ర‌ద‌నీరు నిలిచి నదులను త‌ల‌పిస్తున్నాయి. దాంతో వాహ‌నాల రాక‌పోక‌లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. అదేవిధంగా వ‌డాల ఏరియాలో కూడా భారీ వ‌ర్షం కురుస్తోంది. మెరైన్‌ డ్రైవ్ ఏరియాలో స‌ముద్ర తీరం అల్లక‌ల్లోలంగా మారింది. ఇటీవలే ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. గత శనివారం వరుణుడు శాంతించడంతో ముంబైకర్లు ఊపిరి పీల్చుకోగలిగారు. జనజీవనం గాడిన పడినట్టే కనిపించింది. మళ్లీ ఒక్క రోజు గ్యాప్‌తో వరుణుడు మళ్లీ విరుచుకుపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: