ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎవ‌రి నోట విన్నా, ఏది చూసినా హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్ర‌స్తావ‌న వ‌స్తోంది. అటు పార్టీల అభ్య‌ర్థి ఎంపిక నుంచి ఇటు కేసీఆర్ వ్యూహాల వ‌ర‌కు అన్ని హుజూరాబాద్ ఎన్నిక చుట్టే తిరుగుతోంది. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ నేత‌లు పాద‌యాత్ర‌ల‌కు కూడా సిద్దం అవుతున్నారు. హుజూరాబాద్ ఎన్నికల పుణ్య‌మా అంటూ కేసీఆర్ కొత్త‌గా ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని కూడా ప్ర‌వేశ పెట్టాడు.
దీంతో ఈ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది.

  భూ వివాదంలో ఈట‌ల రాజేంద‌ర్‌పై ఆరోప‌ణ‌లు రావ‌డం, రాష్ట్ర మంత్రి వ‌ర్గం నుంచి ఆయ‌న్ను తీసివేయ‌డంతో ఈట‌ల‌ హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంత‌రం ఎన్నో ఊ
హాగానాల మ‌ధ్య చివ‌రికి బీజేపీలో చేరారు. ఇక్కడి నుంచి మళ్లీ గెలిచేందుకు అప్పుడే పాదయాత్ర కూడా మొదలుపెట్టారు ఈట‌ల‌. టీఆర్ఎస్‌పై ఘాటుగా విమర్శలు గుప్పిస్తూ అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ప్ర‌భుత్వంపై స్వ‌రం పెంచుతూనే ఉన్నారు. ఇదే క్ర‌మంలో ఈటలను గెలిపించుకోవడం బీజేపీ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. ఈట‌ల గెలుపుతో రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతుందని ఆ పార్టీ నాయకత్వం గ‌ట్టిగా న‌మ్ముతోంది.


   మరోవైపు  బీజేపీలో ఈటల చేరడానికి ముందు ఆయనతో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చ‌ర్చ‌లు జ‌రిపాడు. రేవంత్ రెడ్డి తనను కలిసిన సందర్భంగా మళ్లీ కాంగ్రెస్‌లో చేరడానికి విశ్వేశ్వ‌ర్‌రెడ్డి సిద్ద‌మ‌యిన‌ట్టు తెలుస్తోంది. ఇదే క్ర‌మంలో ఉన్నట్టుండి  బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను క‌ల‌వ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.



 అయితే కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్న కొండా.. ఇప్పుడు ఈ రకంగా బీజేపీ నేతతో కలిసి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఈటలను కలవడంపై రాజకీయవర్గాల్లో చర్చనియాంశంగా మారింది. అంత‌కుముందు కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి ఈట‌ల‌కు మ‌ద్ద‌తు కూడా ప‌లికాడు. నిజానికి ఈటల రాజేందర్‌ను రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ వైపు తీసుకొచ్చేందుకు కొండా ప్రయత్నించారనే ప్ర‌చారం కూడా జ‌రిగింది. కానీ ఈటల మాత్రం బీజేపీలో చేరేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేసి ఆ పార్టీలోనే చేరారు.


 ఈ క్ర‌మ‌లో బీజేపీలో చేరిన ఈటల రాజేంద‌ర్‌ను కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎందుకు క‌లిశారు?  అనే ప్ర‌శ్న మొద‌ల‌యింది. ఈట‌ల‌ను మ‌ళ్లీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారా అనే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.  బీజేపీ ముఖ్యనేత జితేందర్ రెడ్డితో కలిసి ఈటలతో చర్చలు జరపడం వెనుక కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్లాన్ ఏంటన్నది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న కొండా.. ఏ పార్టీ వైపు అడుగులు వేస్తార‌నే విష‌యం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: