ఢిల్లీ: అస్సాం, మిజోరం సరిహద్దుల్లో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇవాళ ఈ ఘర్షణల్లో ఐదుగురు అస్సాం పోలీసు అధికారులు మృతి చెందారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో సుమారు 50 మందికి పైగా గాయాలు, మొత్తం ఐదుగురు అస్సాం పోలీసు అధికారులు మృతి చెందారు.  అస్సాం లోని కచ్చర్ జిల్లా ఎస్.పి కి తుపాకీ తూటాల గాయాలు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది.  అస్సాం పోలీసులకు వ్యతిరేకంగా మిజోరం పోలీసులు “లైట్ మెషీన్ గన్స్” (ఎల్.ఎమ్.జి) ను ఉపయోగించి కాల్పులు జరిపినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ట్వీట్ చేశారు. చాలా స్పష్టంగా ఇందుకు సాక్ష్యాధారాలున్నాయని ట్వీట్ లో పేర్కొన్నారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ.  ఈ ఘటన “చాలా బాధాకరం, దురదృష్టకరం. దీని వెనుక ఉద్దేశాలు, పరిస్థితి తీవ్రత ఏమిటో చాలా స్పష్టంగా అర్థమౌతోంది”, అని పేర్కొన్నారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ.


  లైలాపూర్ లోని “రిజర్వ్ అటవీ ప్రాంతం”ను ధ్వంసం చేసి, మిజోరం రాష్ట్రం రహదారిని నిర్మిస్తుండడంతో పాటు, సాయుధ బలగాల శిబిరాన్ని ఏర్పాటు చేస్తోందని, అధికారిక ప్రకటన చేసింది అస్సాం రాష్ట్రం.  “సమస్య పరిష్కారం కోసం వెళ్ళిన అస్సాం పోలీసు బలగాల పై ముందుగా  స్థానిక అల్లరిమూకలు,  ఆ తర్వాత మిజోరం పోలీసులు దాడులు జరిపారని “ ప్రకటనలో పేర్కొంది అస్సాం. “అస్సాం పోలీసులు సరిహద్దులు దాటి, మిజోరంలోని “కొలాసిబ్” వద్ద ఉన్న తమ “పోలీసు పోస్ట్” ను ధ్వంసం చేయడంతో  హింసాత్మక సంఘటనలు మొదలయ్యాయని” ట్విట్టర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చింది  మిజోరం. “అంతేగాకుండా, జాతీయ రహదారి పై ఉన్న వాహనాలను అస్సాం పోలీసు బలగాలు ధ్వంసం చేయడంతో పాటు, తమ రాష్ట్ర పోలీసులపై కాల్పులప జరిపారని,” పేర్కొన్నారు మిజోరం ముఖ్యమంత్రి జోరాంథాంగా. 

షిల్లాంగ్ లో ఇటీవల ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం అయిన రెండు రోజుల తర్వాత జరిగిన ఈ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోవడవం గమనార్హం.  నిన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఫోను లో మాట్లాడి సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోరారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఇక అంతకు ముందు అస్సాం  ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ, మిజోరం ముఖ్యమంత్రి జోరాంథాంగాల మధ్య జరిగిన  “ట్వీట్ల” యుద్ధం కొనసాగింది.   పోటాపోటీగా “ట్వీట్లు” ద్వారా  జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించిన వీడియోలను  పోస్ట్ చేయడంతో పాటు, అమిత్ షా జోక్యం చేసుకోవాలని కోరారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఇది ఇలా ఉండగా... ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్న వివాదాలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: