మమతా బెనర్జీ. బెంగాల్ కి హ్యాట్రిక్ సీఎం. ఆమె మూడవసారి గెలవడం చాలా విలువైనది. జాతీయ రాజకీయాల్లో ఆమె ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. మమతా వర్సెస్ మోడీ అన్నట్లుగా సాగిన ఆ పోరులో మమత గెలుపు సరికొత్త మలుపుగా విపక్ష రాజకీయ కూటమి కూడా భావిస్తోంది..

గతం కంటే ఎక్కువ సీట్లు మమత గెలుచుకున్నారు. బీజేపీని బాగా నిలువరించారు. అధికారం మాదే అని జబ్బలు చరచిన ఆ పార్టీకి వందలోపు సీట్లు చూపించి డబుల్ డిజిట్ దాటకుండా చూశారు. అయితే ఇంతటి విజయంలోనూ ఒక బాధ ఏదైనా ఉంది అంటే నందిగ్రాం లో మమత ఓటమి. మమత ఇపుడు ఓడినా కూడా సీఎం. కానీ ఆరు నెలలలోగా ఆమె తన పదవికి రాజీనామా చేయాలి. ఈ మధ్యనే మమత శాసనమండలిని కోరుతూ తీర్మానం చేశారు. దాన్ని కేంద్రానికి పంపారు. కానీ కేంద్రంలో బీజేపీకి మమత సీఎం గా ఉండడం అసలు లేదు. అందుకే వారు మండలిని పునరుద్ధరిస్తారు అనుకోవడం అత్యాశే అవుతుంది.

మరో వైపు మూడవ దశ కరోనా పొంచి ఉన్న నేపధ్యంలో ఇప్పట్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే వీలు లేదు. దాంతో మమ‌త మరో మూడు నాలుగు నెలల్లో తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందే అంటున్నారు అంతా. అయితే ఇక్కడ మమత తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. రెండు సార్లు బెంగాల్ సీఎం చేసిన ఆమె చూపు ఇపుడు ప్రధాని పదవి మీదనే ఉంది. తాను ఎమ్మెల్యేగా నెగ్గకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆమె ఏకంగా తన మకాం ఢిల్లీకి మార్చేస్తారు అంటున్నారు. తన మనిషిని బెంగాల్ పీఠం మీద కూర్చోబెట్టి ఢిల్లీలో మోడీకి వ్యతిరేకంగా రానున్న రెండున్నరేళ్ళూ పోరాడుతారు అంటున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో భాగంగా ఆమె దేశమంతా తిరిగి విపక్షాలను  కూడగడతారు అని కూడా తెలుస్తోంది. అంటే మమతను బెంగాల్ సీఎం గా ఉంచకపోతే ఆమె నేరుగా ఢిల్లీ మీదకే దండెత్తి వస్తారు అన్న మాట. ఈ పరిణామం బీజేపీకి మింగుడుపడనిదే. మొత్తానికి మమత తన పొలిటికల్ అజెండాను బాగానే  ప్లాన్ చేసి పెట్టుకున్నారు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: