కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ పర్యటనలో ఆసక్తిర అంశాలు చోటు చేసుకున్నాయి. కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవారికి ఉచితంగా బియ్యం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రేషన్ సరకులకు ఇవి అదనం. అయితే వీటి క్రెడిట్ అంతా ఎక్కడికక్కడ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తోందని బీజేపీ నేతలు ఆందోళన పడుతున్నారు. అందుకే రేషన్ దుకాణాల వద్ద మోదీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఇవి మోదీ బియ్యం అని ప్రచారం చేస్తున్నారు.

ఏపీ విషయానికొచ్చే సరికి ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ వాహనాలను పంపి సరకులు అందిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని మాత్రం కేవలం రేషన్ దుకాణాల వద్ద మాత్రమే పంపిణీ చేయాలని బీజేపీ నాయకులు రూల్ పెట్టారు. దీంతో రాష్ట్రం కూడా మనకెందుకులే అని దీన్ని లైట్ తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ నాయకులే చొరవ తీసుకుని స్థానిక తహశీల్దార్లను అప్రమత్తం చేసి బియ్యం పంపిణీపై ఫోకస్ పెట్టారు. తాజాగా ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ప్రజలకు అవి మోదీ బియ్యం అని చెప్పడానికి ఉత్సాహ పడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


 విశాఖ పట్నం జిల్లాలో పర్యటించిన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ, కశింకోట మండలం తాళ్లపాలెం రేషన్ డిపోను తనిఖీ చేశారు. ఆ సందర్భంగా కేంద్రం వాటాగా ఇచ్చే బియ్యాన్ని రేషన్ షాపుల వద్దే ఇవ్వాలని, అన్ని షాపుల్లోనూ ప్రధాని ఫొటోతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేంద్ర పథకం గురించి వివరించాలని చెప్పారు. ఆ తర్వాత అక్కడకు వచ్చిన లబ్ధిదారుల్ని ఆ బియ్యం ఎవరిస్తున్నారో మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. దానికి వారు సమాధానం చెప్పలేక పోవడంతో, వైసీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ ని పిలిచి ఉచిత బియ్యంపై వివరించాలని కోరారు. ఈ సందర్భంగా వారి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మా అన్న పథకాలైతే మేం వివరించగలం అని ఎమ్మెల్యే అమర్ నాథ్ చెప్పగా.. ప్రధాని మోదీ దేశంలో అందరికీ అన్నలాంటివారేనని గుర్తుంచుకోవాలని అన్నారు నిర్మలా సీతారామన్.

మొత్తానికి రేషన్ బియ్యం విషయంలో కేంద్రం ఎంత పట్టింపుతో, పట్టుదలతో ఉందో మరోసారి అర్థమైంది. కేంద్ర పథకాల పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ క్రెడిట్ కొట్టేస్తున్నాయనే అనుమానం వారిలో ఉంది. అందుకే రేషన్ సరకుల పంపిణీ విషయంలో ప్రధాని మోదీ ఫొటో కచ్చితంగా ఉండాలంటున్నారు బీజేపీ నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి: