హుజురాబాద్ బై పోల్ సమరంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మూడు ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు రంగంలో ఉన్నారు. సీనియర్ నేత, ఆరుసార్లు  విజేత, ఈటెలతో ఇద్దరు విద్యార్థి నేతలు  తలపడుతున్నారు. అందులో ఒకరు అధికార పార్టీ నుంచి పోటీ పడుతుండగా, మరొకరు కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగారు. ఓ పక్క అధికార పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తుంటే కాంగ్రెస్ మాత్రం ఇంకా పోరాటాన్ని మొదలు పెట్టలేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీజేపీలు ఫిక్సింగ్ చేసుకుంటాయని టిఆర్ఎస్ ను దెబ్బ కొట్టే వ్యూహంతో ఆ రెండు పార్టీలు లోలోపల చేతులు కలుపుతాయనే ఆందోళనలో గులాబీ దళం ఉంది. కెసిఆర్ పై ధిక్కార పతాకాన్ని ఎగరేసిన ఈటెల రాజేందర్  కు లోపాయికారిగా సహకరించడం ద్వారా కాంగ్రెస్ ప్రతీకారం తీర్చుకోవచ్చు అనేది టిఆర్ఎస్ నేతల మాట.

 టిఆర్ఎస్ ను ఓడించడం అనే ఉమ్మడి  లక్ష్యం మేరకు ఈటెల కు రేవంత్ రెడ్డి సహకారం అందిస్తారని టిఆర్ఎస్ నేతలు అంటున్నారు. అందుకే తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడో తిరుగుతున్న రేవంత్ రెడ్డి హుజురాబాద్ కు రావడం లేదని అంటున్నారు. నామినేషన్ కు వచ్చిన ఆయన మళ్లీ ఎప్పుడు వస్తాడు, కాంగ్రెస్ ఎప్పుడు ప్రచారం మొదలుపెడుతుంది అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. ఈటెల గెలవడం వల్ల టిఆర్ఎస్ ఓడిపోవచ్చేమో కానీ కాంగ్రెస్ కు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు తెలంగాణలో టిఆర్ఎస్ గెలిచిన పరవాలేదు కానీ బీజేపీ గెలవడం వల్లే కాంగ్రెస్ కు ఎక్కువ నష్టం. టిఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం   అని ప్రచారం బిజెపి చేసుకుంటుంది. 2023 లో టిఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి రాబోయేది కూడా తామేనని ప్రకటించుకున్నారు బిజెపి నేతలు. ఇలాంటి పరిస్థితుల్లో హుజురాబాద్  లో బిజెపి వెనక కాంగ్రెస్ సహకారం అందిస్తే ఆ పార్టీ తన ఎదుగుదలకు తానే చెక్ పెట్టుకున్నట్లు.

టిఆర్ఎస్ గెలిస్తే  అధికారాన్ని ఉపయోగించుకుని గెలిచారంటూ కాంగ్రెస్ తెల్చేయచ్చు. అదే బీజేపీ గెలిస్తే ఆ పార్టీయే ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. అలాంటిది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈటెల విజయం కోసం కాంగ్రెస్ లోపాయికారిగా పని చేస్తుందా అంటే అలా జరిగే చాన్స్ లేదు. మరి కాంగ్రెస్ వెంకట్ ని ఎందుకు పోటీలో నిలిపింది. రేవంత్ ఏ వ్యూహంతో ముందుకు వెళ్తారు అనేది హుజురాబాద్ ఫలితాల్లో కీలకం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: