ఈ మధ్య టి‌డి‌పి అధినేత చంద్రబాబు బాగా దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. ఓ వైపు వైసీపీపై పోరాడుతూనే, మరోవైపు సొంత పార్టీని ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పటివరకు ఓపిక పట్టిన బాబు...పనిచేయని నేతలని నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తున్నారు. ఇటీవల పలు నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలని పక్కనబెట్టి కొత్త నాయకులకు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. సాలూరులో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ భాంజ్‌ని పక్కనబెట్టి గుమ్మడి సంధ్యారాణికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు.

అలాగే పామర్రులో మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనని సైడ్ చేసి వర్ల కుమార్ రాజాకు బాధ్యతలు అప్పగించారు. ఇక భీమవరంలో యాక్టివ్ గా లేని గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు పులపర్తి రామాంజనేయులుని పక్కనబెట్టి తోట సీతారామలక్ష్మికి బాధ్యతలు అప్పగించారు. ఇదే క్రమంలో నిడదవోలు నియోజకవర్గంలో కూడా మార్పులు చేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


నిడదవోలు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన నియోజకవర్గం...2009, 2014 ఎన్నికల్లో నిడదవోలు నుంచి బూరుగుపల్లి శేషారావు వరుసగా గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో శేషారావు ఓటమి పాలయ్యారు. వైసీపీ తరుపున శ్రీనివాస్ నాయుడు విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా శ్రీనివాస్ నాయుడుకు అంతగా మంచి మార్కులు ఏమి పడటం లేదు. ఇటీవల వచ్చిన పలు సర్వేల్లో శ్రీనివాస్ నాయుడుకు కాస్త ఇబ్బందికర పరిస్తితులు ఉన్నాయని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే శ్రీనివాస్ నాయుడుకు గెలుపు కష్టమైపోతుందని సర్వేలు చెప్పాయి.

కానీ వైసీపీకి నెగిటివ్ ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోలేని స్థితిలో టి‌డి‌పి నేత శేషారావు ఉన్నారు. ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అయినా సరే నియోజకవర్గంపై మళ్ళీ పట్టు తెచ్చుకోలేకపోయారు...మళ్ళీ పార్టీని బలోపేతం చేయలేకపోయారు. దీంతో శేషారావుని సైడ్ చేసి మరో దూకుడుగా ఉండే నేతకు బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు సిద్ధమవుతున్నారట. అలాగే శేషారావుకు రానున్న రోజుల్లో ప్రాధాన్యత ఇస్తామని చెప్పనున్నారని తెలుస్తోంది. పార్టీ భవిష్యత్ కోసమే చంద్రబాబు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడటం లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: