కేసీఆర్ అంటే.. ఓ మాటల మరాఠీ.. అద్భుతమైన ప్రసంగ శక్తి కల నాయకుడు.. తిమ్మిని బమ్మి..బమ్మిని తిమ్మి చేయగల దిట్ట.. ఏమాట చెప్పినా.. దాన్ని జన రంజకంగా చెప్పగల నేత. ఎన్ని అబద్దాలు చెప్పినా... ఈయన చెప్పేది నిజమే కదా అని జనం అనుకునేలా నమ్మకంగా మాట్లాడగల నాయకుడు.. అందుకే కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే.. అందరికీ ఆసక్తి.. ప్రజల వాడుక భాషలో.. తేలికపాటి పదాలతో.. చక్కటి సామెతలతో ప్రసంగాన్ని ఆకట్టుకునేలా చెప్పే దమ్మున్న అతికొద్దిమంది రాజకీయ నాయకుల్లో కేసీఆర్ ఒకరు.


అయితే.. కేసీఆర్‌లో మరో కోణం కూడా ఉంది.. కేసీఆర్ ఎంతటి రాజకీయ నాయకుడో.. అంతటి దార్శనికుడు కూడా. రాజనీతిజ్ఞుడు కూడా. ఆయనకు తనపై విపరీతమైన నమ్మకం.. సమాజంపై చక్కటి అవగాహన.. రాజకీయ ఎత్తుగడలతో పాటు ఈ దేశం పట్ల ప్రేమ, అవగాహన ఉన్న నాయకుడు.. నిన్నటి ప్రెస్ మీట్‌లో ఆయన స్థానిక రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడారు.. ఆ సమయంలో ఆయన మన దేశ భవిష్యత్ గురించి ఎంతో ఆవేదనతో చెప్పిన మాటలు.. ఆలోచింపజేసేవిగా ఉన్నాయి.


ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా సాగుభూమి, సారవంతమైన నేల, నీటి వనరులు ఉన్న దేశం మనదని కేసీఆర్ అన్నారు.. కానీ.. సరైన అభివృద్ధి వ్యూహం, రాజకీయ విధానం, ఆర్థిక, వ్యాపార వ్యూహాలు లేక.. నామమాత్రపు అభివృద్ధితో వెనుకబడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగపూర్‌ వంటి చిన్న చిన్న దేశాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని.. అక్కడ పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందిందని.. కానీ.. అంత గొప్ప పర్యాటక ప్రాంతాలు కాకపోయినా.. విపరీతంగా ఆదాయం సంపాదిస్తున్నాయని కేసీఆర్ అన్నారు.


లీక్వాన్‌ అనే ఓ నాయకుడు సింగపూర్ భవితవ్యాన్ని మార్చాడని.. అలా ఇండియాను కూడా సమూలంగా మార్చే నాయకుడు వస్తాడని.. అప్పుడు ఇండియా అద్భుతంగా మారుతుందని అన్నారు. తాను భగవంతుడిని నమ్ముతాడని.. ఆ అద్భుతం సాకరమవుతుందని ఆశిస్తున్నానని కేసీఆర్ అన్నారు. మరి కేసీఆర్ కల ఎప్పుడు సాకారం అవుతుందో.. సాకారం చేసే నాయకుడెవరో..?

మరింత సమాచారం తెలుసుకోండి: