రాయ‌ల‌సీమ క‌ష్టం చూసి ప‌ల్లెల ద‌య‌నీయ‌త‌ను చూసి చ‌లించిపోయాడు తెలంగాణ క‌వి గోరెటి వెంక‌న్న.. అలాంటి సంద‌ర్భ‌మే ఇవాళ కూడా! ప‌ల్లె క‌న్నీరెడుతోంది. ప్ర‌కృతి విధించిన శాపాల‌కు బ‌లి అయిపోయి క‌న్నీరెడుతోంది. కొన్ని క‌నిపించ‌ని కుట్ర‌లూ ఉన్నాయి.. క‌బ్జాలూ ఉన్నాయి..ఫ‌లితంగా సీమ బిడ్డ‌ల‌కు ఇవాళ నిలువ నీడ లేదు. ప‌ట్టెడు మెతుకులే లేవు ఇప్ప‌టికీ కొంద‌రికి. ఆదుకోవాల్సిన ప్ర‌భుత్వం చేసే సాయం క‌న్నా ప్ర‌జా చైత‌న్యంతో అందే సాయ‌మే బాధితుల‌కో గొప్ప ఊర‌ట‌! రా రండి ప్ర‌జ‌లారా తోటి మాన‌వ శ్రేయ‌స్సు కోసం ప‌ని చేద్దాం ప్రార్థిద్దాం ఉన్నంత‌లో దాతృత్వం చాటి క‌ష్టాల నుంచి ఒడ్డెక్కిద్దాం. విప‌త్తుల నుంచి సీమ బ‌య‌ట ప‌డేందుకు తెలంగాణ ప్ర‌జ‌ల ఔదార్యం ఇవాళ ఓ అతి ముఖ్య‌మ‌యిన భూమిక పోషించ‌నుంది అన్న‌ది సుస్పష్టం.మ‌నుషులం క‌దా ఒక‌రినొక‌రు సాయం చేసుకోవాలి. మ‌నుషులం క‌దా ఒక‌రికొక‌రు అన్న దృక్ప‌థం బ‌ల‌ప‌రుచుకోవాలి. మ‌నుషు లం క‌దా ఆ పాటి అండ ఒక‌రికొక‌రు ఇచ్చుకోవాలి. ఇవ‌న్నీ చేసిన‌ప్పుడే మ‌నం సాధించాల‌నుకున్న‌వి, మ‌నం చేయాల‌నుకున్న‌వి చేయ‌గ‌లం. లేకుంటే మ‌నిషి అన్న ప‌దమే వృథా అయిపోతుంది. జ‌న్మ కూడా వృథా అయిపోతుంది. విపత్త‌ల స‌మ‌యంలో ప్రాంతాల‌కతీతంగా అంతా క‌ద‌లాలి. క‌దిలిరావాలి. క‌ష్టమే అయినా క‌ష్టం ఎంత అయినా నేనున్నాన్న భ‌రోసా తోటి వ్య‌క్తి జీవితంలో సంతోషం నింపుతుంది.


ఆ దిశ‌గా తెలంగాణ స‌మాజం సీమ ప్రాంతంలో ఉన్న వ‌ర‌ద పీడితులకు బాధితుల‌కు అండ‌గా ఉండాలి. వ‌ర‌ద‌తో అత‌లాకుత‌లం అయిపోయిన నెల్లూరు, చిత్తూరు, క‌డ‌ప, అనంత‌పురం జిల్లాల‌కు చెందిన దాదాపు 95 వేల కుటుంబాల‌ను ఆదుకునే ప్ర‌య‌త్నం ఎవ్వ‌రు చేసినా అది హ‌ర్ష‌ణీయం. ఇప్ప‌టికిప్పుడు స్పందించి బాధిత కుటుంబాల‌కు కావాల్సిన భోజ‌న, స‌వ‌తి సౌకర్యాలు క‌ల్పించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వందే అయినా, అధికార యంత్రాంగం అందుకు కృషి చేయాల్సి ఉన్నా అంద‌రికీ ఈ స‌మ‌యంలో అన్నీ అంద‌వు. అందుకోలేరు కూడా! క‌నుక కొంత‌లో కొంత అయినా మాన‌వ‌తా దృక్ప‌థంతో సాటి వారి క‌ష్టం విష‌య‌మై క‌దిలి రావాల్సిన తరుణం ఇది.


 తెలంగాణ స‌మాజం చైత‌న్యానికి ప్ర‌తీక క‌నుక తోటి ప్రాంతంకు చెందిన బాధితుల‌ను ఆదుకుని పెద్ద మ‌న‌సు చాటుకోవాల్సిన స‌మ‌యం ఇది. గతంలోనూ ఏ విప‌త్తు వ‌చ్చినా ఆదుకున్న గొప్ప మ‌న‌సు తెలంగాణ నేల‌ది. అక్క‌డి ప్ర‌జ‌ల‌ది. తోటి వారికి క‌ష్టం అంటే వెంట‌నే చ‌లించే గుణం, ఆక‌లి అంటే ప‌ట్టెడ‌న్నం పెట్టి ఆద‌రించే గుణం ఆ ఆత్మీయ గుణం ఒక్క తెలంగాణ నేల‌కే సొంతం. ఈ విప‌త్క‌ర స‌మ‌యంలోనూ అలాంటి ఉదార‌తే చాటాలి. సినీనటులు స్పందించి నా స్పందించ‌క‌పోయినా ఎవ‌రికి వారు త‌మంత‌ట తాము ముందుకు వచ్చి బాధిత కుటుంబాల క‌న్నీరు తుడ‌వాల్సిన సందర్భం ఇది. నా ప్రియ తెలంగాణ పౌరులారా స్పందించి సీమ వాసుల‌ను నెల్లూరు వాసుల‌ను ఆదుకుని స‌హృద‌య‌త చాటండి. మాన‌వ‌త‌కు మ‌రో నిద‌ర్శ‌నం మీరే కావాలి అని గుర్తించండి. ప్రాంతాలు వేర‌యినా మ‌నుషులంతా ఒక్క‌టే అని ఓ గొప్ప నినాదం వినిపించి ఆచ‌రించి స‌దాశ‌యంతో ముందడుగు వేయండి. ప్లీజ్ సేవ్ రాయ‌ల‌సీమ  అండ్ ప్లీజ్ సేవ్ నెల్లూరు ఆల్సో...


మరింత సమాచారం తెలుసుకోండి: