వేలాది మంది కుటుంబాలకు మొత్తానికి భూమి లేని కారణంగా లేదా సరిపోయిన పరిమితిలో లేకపోవడంతో ఉన్న వారి భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసే కౌలు రైతులు భూమి కలిగి ఉన్న వారి కంటే ఒక దశలో ఎక్కువగా ఉన్నారని తేలింది. కారణాలు ఏవైనా ఆత్మహత్యలకు పాల్పడిన వారు ఎక్కువగా కౌలు రైతులే. గత ఏడున్నర సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా లక్ష మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 7 వేలకు పైగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ కౌలు రైతులకు ఒకవైపు రైతుబంధు వర్తించక, మరొకవైపు రైతు బీమా కు అర్హులు కాకపోవడంతో ఒప్పుకున్న కౌలు యజమానికి ఇవ్వలేక పెట్టుబడులు ఎక్కువై అప్పులపాలై దిక్కుతోచని పరిస్థితుల్లో మార్గాంతరం లేక ఆత్మహత్యల పాలుకావడం రాష్ట్రంలో ఎక్కువగానే జరిగింది. అయినా ప్రభుత్వం రైతుల కోసం ఎంతో చేస్తున్నామని ప్రకటిస్తున్న ప్పటికీ చేస్తున్న ఖర్చులో కౌలు రైతులకు దక్కకపోగా ఆ కుటుంబాలు మరీ చిన్నాభిన్నం అవుతున్నవి. రుణ మాఫీ పథకం అంటూ ప్రవేశపెట్టినప్పటికీ ఉన్న రుణ మొత్తాన్ని ఒకేసారి మాఫీ చేయకపోవడంతో అసలు మిత్తి జోడు కావడం వలన అప్పు రూపాయలు తగ్గకపోగా నిర్బంధ వసూలుకు పాల్పడడంతో మరింత అగాధంలోకి
 నెట్టివేయబడుతున్నారు.  రైతు లోకానికి ఎరువులను ఉచితంగానే సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం సరఫరా చేయకపోగా భారీ ఎత్తున ధరలు పెరగడంతో పాటు కల్తీ విత్తనాలు, పురుగు మందుల వలన మరింత నష్టపోతూ అనాధలుగా మారుతున్నారు.
 
   ఇదంతా ఎందుకంటే..?

    ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఊపిరి పీల్చుకోకుండా చేస్తూ ప్రచార ఆర్భాటాలు, పథకాలలో నిబంధనల లోపాలు రైతుల పాలిట శాపంగా మారుతున్న వేళ ఢిల్లీలో సంవత్సరకాలంగా సమ్మె చేస్తున్న రైతుల పోరాటపటిమను చూసైనా రాష్ట్ర రైతాంగం ఉద్యమించా ల్సిన అవసరం ఉన్నది. గత సంవత్సరం వరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఈ సంవత్సరం మాత్రం వర్షాకాల పంట కొనుగోలు ను తాత్సారం చేస్తూ యాసంగి పంట గురించి కేంద్రము తో వాదులాటకు పోయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఆరోపించు కొని రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత నెలరోజులకు పైగా పండిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోగా వర్షాలు తదితర కారణాలతో పండిన పంట చేతికి దక్కకపోగా రైతులు నష్టపోతూ ఆందోళన బాట పట్టిన సంగతి మనం అందరం చూస్తూనే ఉన్నాం. పైగా ఢిల్లీ ఉద్యమంలో మరణించిన 700 మందికి పైగా రైతుల కుటుంబాలకు మూడు లక్షల చొప్పున పరిహారం ఇస్తానని మాట ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రైతాంగాన్ని మాత్రం పట్టించుకోకపోగా నిబంధనలు పాటించని కారణంగా ప్రభుత్వ పరిహారం ఎవరికీ అందడం లేదు. తెలంగాణ ఉద్యమ కాలంలో 1400 మంది  బలిదానాలకు పాల్పడి అమరవీరులయితే వారి కుటుంబాలలో సగం మందిని కూడా గుర్తించకపోగా మిగతా సగం మందికి మాత్రమే ఆర్థిక సహాయం అందినట్లుగా తెలుస్తున్నది.

 ఇక్కడ మరిచి అక్కడి కోసం ప్రకటనలా..?

   అమరవీరులు, ఆత్మహత్యల పాలైన రైతులు, కార్మికులు తదితర లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందకపోవడంతో ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. తెలంగాణ కోసం బలిదానాలకు పాల్పడిన అమరవీరుల కుటుంబాలు కూడా అనాధలుగా మారిపోయాయి.  ఇంతకాలంగా అమరవీరులకు, అర్హులైన రైతులకు ప్రభుత్వ  పరిహారం అందక పోగా ఢిల్లీ లో అమరులైన ఏడు వందల మంది రైతులకు మాత్రం మూడు లక్షల చొప్పున పరిహారం ప్రకటించి రైతు కుటుంబాలు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజానీకం దృష్టిలో ముఖ్యమంత్రి భేష్ అనిపించుకున్నాడు. పరిహారం ప్రకటిస్తే అభ్యంతరం లేదు కానీ రాష్ట్ర రైతాంగానికి, ఆత్మహత్యలు  చేసుకున్న రైతు కుటుంబాలకు నిబంధనల పేరుతో పరిహారం అందకుండా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ ధోరణి పట్ల రైతులు ,ప్రజలు, ప్రజాస్వామిక వాదులు విమర్శిస్తున్నారు.

    వెంటనే అందించాలి:

    ఆత్మహత్య చేసుకున్న రైతు ల వయసు 57 నుండి వృద్ధాప్యం వరకు కూడా పెంచాలి. రైతుబంధు కౌలు రైతులకు కూడా వర్తింప చేయాలి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు కూడా  పరిహారం అందజేస్తున్నట్లు తెలుస్తున్నది. కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని కుటుంబ సభ్యుల లో ఎవ్వరు చనిపోయినా రైతు బీమా ఆ కుటుంబానికి వర్తించే విధంగా సవరించాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతే కాకుండా రైతుబంధు పథకాన్ని పరిమిత స్థాయిలో భూమి కలిగిన వారికి మాత్రమే వర్తింప చేయడం ద్వారా , బడా భూస్వామ్యా వర్గాలకు ప్రభుత్వం వృధాగా చెల్లిస్తున్న వేల కోట్ల రూపాయలను ఆదా చేయవచ్చు. ఆ డబ్బులు క్షేత్రస్థాయిలో వాస్తవంగా కష్టపడుతూ పని చేస్తున్న రైతులకు వర్తింప చేయడం ద్వారా భూమి లేని రైతుకూలీలకు కూడా అంతో ఇంతో ఆర్థిక సహకారాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు రాష్ట్ర రైతాంగానికి, అమరుల కుటుంబానికి, అర్హులైన వారికి పరిహారం అందించడం ద్వారా రాష్ట్రంలో గెలిస్తే రచ్చ గెలవడానికి మార్గం సుగమం అవుతుందని విశ్లేషకులు, రైతు సంఘాలు, ప్రజాస్వామిక వాదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: