తెలంగాణ‌లో కాషాయ పార్టీ క్ర‌మంగా బ‌లం పెంచుకుంటోంది. దుబ్బాక‌, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఫ‌లితాల‌తో అధికార పార్టి టీఆర్ఎస్ కు స‌వాల్ విసురుతోంది. మొద‌టి నుంచి గులాబీ పార్టీకీ తామే ప్ర‌త్యామ్నాయం అని చెబుతున్న బీజేపీ ఆ దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌పేరుతో బండి సంజ‌య్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌తో బీజేపీకి తెలంగాణ‌లో కాస్తా పాపులారిటి వ‌చ్చింద‌నే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈట‌ల రాజేందంర్ పార్టీని బ‌లోపేతం చేసేందుకు స‌మాయ‌త్తం అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో విజయం సాధించిన ఈట‌ల రాజేంద‌ర్ గులాబీ పార్టీలో అసంతృప్త నేత‌ల‌ను ఆక‌ర్షించేందుకు చూస్తున్నార‌నే చర్చ కొన‌సాగుతోంది.

 
    అధికార పార్టీ అనుస‌రిస్తున్న విధానాలు, చేస్తున్న ప‌నుల‌కు కొంద‌రు టీఆర్ఎస్ నేత‌లు అసంతృప్తులుగా ఉన్నార‌న్న‌ది చాలా రోజులుగా న‌డుస్తున్న చ‌ర్చ‌. హుజురాబాద్‌లో ఎంతగానో శ్ర‌మించినా అక్కడి ఓట‌మి నుంచి ఇంకా తేరుకోలేక‌పోతున్నారు. అదీగాక ఎన్నోఏళ్లుగా పార్టీ కోసం ప‌ని చేస్తున్న త‌మ‌కు అనుకున్న న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని ఎవ‌రి దారి వారు చూసుకునే  ప‌నిలో ప‌డ్డార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే, ఇలాంటి నేత‌ల‌తోనే ఈట‌ల సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. టీఆర్ఎస్ ను ప‌త‌నం చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న ఈట‌ల.. మ‌రింత ఎత్తుకు ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.


 అయితే, టీఆర్ఎస్ నుంచి ఈట‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఆయ‌న అనుచ‌రుల‌ను టీఆర్ఎస్ చేర‌దీసింది. త‌రువాత ఈట‌ల గెలుపొంద‌డంతో ఆయ‌న్ను విడిచి వ‌చ్చిన వారిని కాపాడుకునేందుకు ఏదో విధంగా వ్యూహాలు ప‌న్నుతోంది. అయినా చాలామందిలో నిరాశే నెల‌కొంది. తెలంగాణ రాష్ట్రం కోస‌మే కాకుండా పార్టీ కోసం కృషి చేసిన కొంద‌రిని గులాబీ బాస్ ప‌ట్టించుకోవ‌డం లేద‌నే నిరాశ‌తో ఉన్నారు. ఇలాంటి వారిని ఈట‌ల చేర‌దీస్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఈట‌ల రాజేంద‌ర్ త‌న‌వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఎలాంటి ప‌రిణామాలు తీసుకువ‌స్తుందో వేచి చూడాలి.





 

మరింత సమాచారం తెలుసుకోండి: